నంద్యాలలో ఉప ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో ప్రతిపక్షనేత జగన్ చేసిన వ్యాఖ్యపై దుమారం రేగి చివరకు ఎన్నికల సంఘం వరకూ వెళ్లింది.అయినా వైసీపీలో ఎవరూ దాన్ని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించకపోవడం విచిత్రం. పైగా వరుసకట్టి సమర్థించడం మరింత ఆశ్చర్యం అంటున్నారు. వ్యాఖ్యల వెనువెంటనే రోజా వంటి వారు సహజశైలిలో ఏదోమాట్టాడారు సరే. మూడు రోజుల తర్వాత బొత్స సత్యనారాయణ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు కూడా వాటిలో తప్పేముందని వాదించాల్సిన అవసరమేమిటి? బహుశా ఈ విషయమై ఎలాటి సంజాయిషీ ధోరణి వద్దని చెప్పడమే ఉద్దేశం కావచ్చు. కాని దానివల్ల ప్రయోజనమేమీ లేదు. చివర వరకూ ఈ మాటలను సమర్థించుకోవడం ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది.పైగా రేపు జగన్ను గాని ఇతరులను గాని మరెవరైనా ఇలా అంటే తప్పని చెప్పే అర్హత కూడా పోతుంది. టిడిపి వ్యూహాత్మకంగా దాన్ని పెద్దది చేస్తుంటే వైసీపీ కూడా వెనక్కు తగ్గవద్దని భావించడంలో ఆంతర్యం ఏమిటి? తమకు ఈ మాటలు ఖచ్చితంగా మేలు చేస్తాయని వైసీపీ అంచనా వేసుకుంటున్నది. లాభనష్టాలు ఒకటైతే ఉచితానుచితాలు మరొకటి. ప్రభుత్వ వైఫల్యాలపై లోపాలపై జరగాల్సిన చర్య ప్రతిపక్షనేత మాటలపైకి మరలడం రాజకీయంగా ఎవరికి నష్టమో చిన్న పిల్లలు కూడాచెప్పగలరు. కానివైసీపీలోని సీనియర్లు మాత్రం అదే చెప్పడానికి సాహసించలేక ఏవేవో ఇతర విమర్శలు చేస్తున్నారనిపిస్తుంది.