ఒకప్పటి బాలీవుడ్ మేటి నటుడు మరియు బీజేపీ ఎంపీ శత్రుఘ్న్ సిన్హా తమ రాష్ట్రానికి చెందినవాడని బీహారీలందరూ ఆయన గురించి చాలా గర్వంగా చెప్పుకొంటుంటారు. ఆయన బీహార్ ఆణిముత్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా మెచ్చుకొన్నారు. కానీ అంత ప్రజాధారణ ఉన్న వ్యక్తిని బీజేపీ అసలు పట్టించుకోవడం లేదు. బీజేపీకి చాలా కీలకమయిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆయనని ఉపయోగించుకోవడం లేదు.
దానిపై ఆయన స్పందిస్తూ, “సార్వత్రిక ఎన్నికలకు ముందు మాపార్టీ నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలనుకొనప్పుడు నేను వ్యతిరేకించాను. పార్టీలో కురువృద్దుడు వంటి లాల్ కృష్ణ అద్వాని వెన్నంటి ఉన్నాను. అప్పటి నుండే పార్టీలో క్రమంగా నా ప్రాధాన్యం తగ్గుతూ రావడాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. ఇప్పుడు బీహార్ ఎన్నికలలో కూడా నన్ను పక్కన పెట్టడానికి అదే కారణమని నేను భావిస్తున్నాను. నేను మా పార్టీకి రాజకీయ ప్రత్యర్ధి అయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో సన్నిహితంగా ఉండటం, ఆయన గురించి మంచిగా మాట్లాడటం మావాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారనే సంగతి నాకూ తెలుస్తూనే ఉంది. కానీ దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రులో నితీష్ కుమార్ కూడా ఒకరు. అటువంటి మంచి వ్యక్తితో స్నేహానికి పార్టీలు ప్రతిబంధకం కాదని నేను నమ్ముతున్నాను. అందుకే ఆయనతో నా స్నేహం పార్టీలకతీతంగా కొనసాగుతోంది. కానీ మా స్నేహాన్ని రాజకీయ కోణంలో నుండి చూస్తున్నందునే అపోహలు ఏర్పడుతున్నాయని నేను భావిస్తున్నాను. అందుకు నేను బాద్యుడిని కాను. రాజకీయాలలో ఎప్పుడయినా ఏదయినా కావచ్చునని నేను నమ్ముతున్నాను, “ అని శత్రుఘ్న్ సిన్హా అన్నారు.
ఆయన మొదట్లో మోడీని వ్యతిరేకించిన మాట ఆయనే స్వయంగా ఒప్పుకొన్నారు. కనుక మోడీ కూడా ఆయనను వ్యతిరేకిస్తుండవచ్చును. మోడీకి భయపడి పార్టీలో మిగిలినవారు కూడా శత్రుఘ్న్ సిన్హాను వ్యతిరేకిస్తుండవచ్చును. కానీ పార్టీ ఆయనని పక్కన పెట్టడానికి కారణం మాత్రం మోడీ కాదనే భావించవచ్చును. ఈ ఎన్నికలలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్ధి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారే. కనుక ఎన్నికలలో ఆయనను ఏదోవిధంగా ఓడిస్తే కానీ బీజేపీ అధికారం చేజిక్కించుకోలేదు. ఇటువంటి సమయంలో ఎంతో ప్రజాధారణ కలిగిన బీజేపీ నేత శత్రుఘ్న్ సిన్హా తమ రాజకీయ ప్రతర్ది అయిన నితీష్ కుమార్ దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రులలో ఒకరని ప్రచారం చేస్తుంటే ఇక ఆయనకు వ్యతిరేకంగా బీజేపీ చెప్పే మాటలను, ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరు. అందుకే బీజేపీ శత్రుఘ్న్ సిన్హాని పక్కనబెట్టినట్లు భావించవచ్చును. కానీ ఆయన కూడా పార్టీ పరిస్థితిని అర్ధం చేసుకొని పార్టీకి సహకరించడమో లేక బీజేపీకి గుడ్ బై చెప్పేసి నితీష్ కుమార్ పంచన చేరడమో చేస్తే బాగుంటుంది. లేకుంటే అయన వలన పార్టీకి, పార్టీ వలన ఆయనకీ ఇటువంటి ఇబ్బందులు, అవమానాలు తప్పకపోవచ్చును.