ఎంత బలహీనంగా ఉన్నాసరే, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం అనేది రాజకీయ పార్టీలకు పరిపాటి. పార్టీ పరిస్థితి గురించి అడిగితే ఏ రాజకీయ నాయకుడైనా అలానే మాట్లాడతారు. తాము చాలా బలంగా ఉన్నామనీ, ప్రజలు తమనే కోరుకుంటున్నారనీ, అధికార పక్షాన్ని తిరస్కరిస్తున్నారనే అంటారు. కానీ, ఒక జాతీయ పార్టీ, ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటని అడిగితే ఎవరైనా ఏం చెబుతారు..? 2019లో అధికారం మాదే అని ధీమా వ్యక్తం చేస్తారు. కానీ, కాంగ్రెస్ పార్టీ సమస్యలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, పార్టీలో లోపాల గురించి వాస్తవాలు మాట్లాడారు సీనియర్ నేత జైరాం రమేష్. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎదుర్కొంటోందని ఆయనే అన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ నాయకత్వం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం ఇదని ఆయన స్పష్టం చేశారు.
గడచిన లోక్ సభ ఎన్నికల తరువాత వరుస వైఫల్యాలను పార్టీ ఎదుర్కొనాల్సి వచ్చిందన్నారు. మూడేళ్లలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చేదు అనుభవాలే ఎదురయ్యాయనీ, దీనికి గల కారణాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షోభాలను తట్టుకుని నిలబడటం కాంగ్రెస్ కు కొత్త కాదన్నారు. అయితే, 1996 నుంచి 2004 వరకూ పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందనీ, దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడం ద్వారా 1977లో కూడా పార్టీకి పెద్ద సమస్యే ఎదురైందని జైరాం అన్నారు. అయితే, వాటన్నింటితో పోల్చుకుంటే ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న సమస్య చాలా తీవ్రమైనది ఆయన అభివర్ణించడం విశేషం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలను తట్టుకునే విధంగా పార్టీ వ్యూహాలు ఉండాలనీ, వారితోనే పోరాటం చేయాల్సి ఉంటుందని గుర్తించాలని జైరాం రమేష్ అన్నారు. పార్టీలో పట్టువిడుపు ధోరణి లేకపోతే మోడీ, అమిత్ షా ద్వయాన్ని తట్టుకోవడం అంత సులువైన వ్యవహారం కాదని స్పష్టం చేశారు.
ఇంకా పాత వ్యూహాలు, బూజు పట్టిన ఫార్ములాలతో ముందుకెళ్తే మరిన్ని ఇబ్బందులు తప్పవన్నారు. జాతీయ కాంగ్రెస్ కు నాయకత్వ అనిశ్చితి ఉందని జైరాం రమేష్ చెప్పడం విశేషం. అంటే, సోనియా నాయకత్వంతో పాటు, రాహుల్ గాంధీ నేతృత్వం కూడా అక్కరకు వచ్చే విధంగా లేదనీ, వారి తీరులో కూడా మార్పు రావాల్సిన అవసరాన్ని పరోక్షంగా చెప్పారు. పార్టీలోని బలహీనతల గురించి జైరాం రమేష్ ఇంత బహిరంగంగా చెప్పడం ఒకెత్తు అయితే… భారతీయ జనతా పార్టీ బలాల గురించి గొప్పగా చెప్పడం మరో ఎత్తు! ఓ రకంగా మోడీ, అమిత్ షా ద్వయాన్ని ఆయన మెచ్చుకున్నట్టే కదా. పార్టీ గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడిన జైరాం రమేష్ తీరుపై పార్టీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి..?