నంద్యాల ఉప ఎన్నిక విషయంలో అధికార పార్టీ తెలుగుదేశం అడుగడుగునా ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తోందో చూస్తున్నాం. కొంతమంది మంత్రులు నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు, టీడీపీ ఎమ్మెల్యేలూ ఇతర నాయకులు పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రతీ అంశాన్ని తమకు కలిసొచ్చేలా మలుచుకుంటున్నారు! ఉద్దానం బాధితుల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ వస్తే.. ఆ సందర్భాన్ని కూడా నంద్యాల ఉప ఎన్నికలకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే! పవన్ మద్దతు తమకే ఉంటుందని మంత్రి అఖిల ప్రియ ప్రచారంలో చెబుతున్నారు. ఇంకోపక్క, నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వపరంగా భారీ ఎత్తున నిధులు కేటాయించారు. ఇంత చేస్తున్న టీడీపీ… భారతీయ జనతా పార్టీ సేవల్ని ఎందుకు వినియోగించుకోవడం లేదు..? మిత్ర పక్షమైన భాజపా గురించి నంద్యాల ఎన్నికల బరిలో ఎందుకు ప్రస్థావనకు తీసుకోవడం లేదు..? ఈ ఉప ఎన్నిక విషయంలో కమలనాథులు కూడా ఇప్పటివరకూ ఎందుకు మౌనం దాల్చినట్టు..? ఇంతకీ వారి వైఖరి ఏంటి..? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయం అవుతున్నాయి.
ఈ అంశంపై రెండు రకాల అభిప్రాయాలు చక్కర్లు కొడుతున్నాయి. మొదటిది ఏంటంటే… తెలుగుదేశం పార్టీకి భాజపా దూరం అవుతోందని చెప్పడానికి ఇదో సంకేతంగా కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి ప్రతిపక్ష నేత జగన్ పాదాభివందనం చేయడంతో భాజపాకి దగ్గరయ్యేందుకు వైకాపా ఏ స్థాయిలో ఆతృత పడుతోందో దాదాపు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇదే సమయంలో, రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపకంపై కేంద్రం ఎటూ తేల్చడం లేదు. టీడీపీ, బీజేపీల మధ్య వారధిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యారు. వెరసి ఈ పరిణామాలన్నీ టీడీపీని భాజపాకి దూరం పెట్టేవిగానే చెప్పుకోవచ్చు. నంద్యాల ఉప ఎన్నికలో భాజపా దూరంగా ఉండటానికి కారణం ఇదే అనేది ఒక అభిప్రాయం.
ఇక, రెండో అభిప్రాయం ఏంటంటే… నంద్యాల ఉప ఎన్నికలో ముస్లిం, ఎస్సీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. జయాపజయాలను నిర్ణయించేది ఈ ఓటు బ్యాంకే అనడంలో సందేహం లేదు. సైద్ధాంతికంగా భాజపా అంటే ముస్లిం, ఓస్సీ ఓటర్లకు కొంత వ్యతిరేక భావన ఉంది. కాబట్టి, భాజపాని ప్రచారంలోకి దించితే… ఆయా వర్గాలపై ప్రభావం పడుతుందనీ, అది టీడీపీకి ఇబ్బందికరంగా మారుతుందనీ, ఆ మేరకు ప్రతిపక్షం ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే భాజపాని ఈ ఉప ఎన్నిక వరకూ టీడీపీ దూరం పెట్టిందనే అభిప్రాయమూ వినిపిస్తోంది. ఏదేమైనా, నంద్యాల ఉప ఎన్నిక విషయమై టీడీపీ మిత్రపక్షంగా భాజపా ఇంతవరకూ స్పందించలేదు. ఇదే మౌనాన్ని ఎన్నికలు ముగిసేవరకూ కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కొనసాగిస్తే… అది టీడీపీకి అనుకూల వైఖరిగా చెప్పొచ్చు కదా!