తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని ఇద్దరూ చంద్రులూ ఆశించారు. అంతేకాదు, ఇదే విషయమై గతంలో లేని కలిసికట్టుతనం ప్రదర్శించారు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు… ఇదే పనిమీద చాలా ప్రయత్నాలు చేశారు. నియోజక వర్గాల సంఖ్యను పెంచుకునేందుకు అంతా సిద్ధమనీ, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం ఒక్కటే మిగులుందని అనుకున్న సమయంలో కేంద్రం ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే! ముందుగా రాజకీయ నిర్ణయం జరగాలంటూ వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాలకు అప్పగించేశారు. అంతే, అక్కడితో సీట్ల సంఖ్య ప్రక్రియకు దాదాపు బ్రేకులు పడ్డట్టే అయింది. అయితే, ఇదే విషయమై మరోసారి ఢిల్లీ వెళ్లి, కేంద్ర పెద్దలతో చర్చిస్తారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ, ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టీ చూస్తుంటే, చంద్రబాబు దీనిపై ఆశలు వదిలేసుకున్నారని అనిపిస్తోంది. ఈ దిశగా ఆయన ప్రయత్నాలు విరమించుకోబోతున్నట్టుగానే మాట్లాడారు.
అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య పెంపు ఉన్నా లేకపోయినా ఎలాంటి సమస్య ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం తమకు లేదని చెప్పారు. సీట్ల సంఖ్య పెరిగితే రాజకీయ స్థిరత్వం ఉంటుందన్నదే తమ అభిప్రాయం అని తెలిపారు. మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశమై మాట్లాడారు. నిజానికి, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై మొదట్నుంచీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది నారా చంద్రబాబు నాయుడే అనడంలో సందేహం లేదు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాకముందు ఆయన మాట ఏంటంటే… సీట్ల సంఖ్య పెంపుపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు తనకు సమాచారం ఉందనీ, టీడీపీ ఎంపీలు సిద్ధంగా ఉండాలనీ, నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కాబోతోందని హడావుడిగా అనేశారు!
కానీ, ఇప్పుడు పరిస్థితి మరోలా మారిపోయింది. సంఖ్య పెరిగినా లేకున్నా సమస్యే లేదని అంటున్నారు. నియోజక వర్గాల సంఖ్య పెంపు వల్ల ఎలాంటి ఉపయోగం లేదనుకుంటే గతంలో అంత హడావుడి ఎందుకు చేసినట్టు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా! అసెంబ్లీ స్థానాలు పెరిగితే రాజకీయ స్థిరత్వం వస్తుందని ఇప్పుడు అంటున్నారు. నిజానికి, ఆ స్థిరత్వం కేవలం టీడీపీకి మాత్రమే అవసరం అని చెప్పాలి. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయన్న ధీమాతోనే కదా ఎడాపెడా ఫిరాయింపుల్ని ప్రోత్సహించేశారు. మొత్తానికి, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి భాజపా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పట్లో సీట్ల సంఖ్య పెరిగే అవకాశం లేదని చంద్రబాబు మాటల్లోనే అర్థమౌతోంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచడం వల్ల భాజపాకి వీసమెత్తైనా ఉపయోగం లేదని ఆ పార్టీ నేతలే విశ్లేషణలు చేస్తున్నారు. అలాంటప్పుడు కేంద్రం ఎందుకు పెంచుతుంది..? పైగా, అధికారంలోకి ఉన్నది భారతీయ జనతా పార్టీ అనే విషయం మరచిపోకూడదు. తాము చేయిపెట్టిన చోట ఎంతో కొంత కాషాయ వర్ణం కాకపోతే వారెందుకు ముట్టుకుంటారు..?