తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రజల్లోనే ఉండేవారు. యాత్రలూ ధర్నాలూ దీక్షలూ అంటూ జనంతో మమేకమై ఉంటూ వచ్చేవారు. తెలంగాణ ఏర్పడి, ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీరు మారిందనే విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. వాస్త దోషమో జాతక సమస్యో తెలీదుగానీ… ఆయన సచివాలయానికి రావడం మానేశారు. దాంతో పాలన చతికిల పడిందని విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. సరే, ప్రగతీ భవన్ అంటూ కొత్తగా ప్రారంభించారు. అక్కడి నుంచే ప్రజా దర్బారులు ఉంటాయనీ, ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి నేరుగా వింటారనీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటారని అన్నారు. కానీ, ఆ దర్బారు కార్యక్రమాలు కూడా అరకొరగా సాగుతున్నాయి. దీంతో ప్రజలకు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు పెరిగాయి. నిజానికి, తెరాస శ్రేణుల్లో కూడా ఇదే అసంతృప్తి కొంతమేర ఉంది. కేవలం సమీక్షలూ సమావేశాలకు మాత్రమే సీఎం కేసీఆర్ పరిమితం అవుతున్నారనీ, ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు తెరాస వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. వీటన్నింటికీ కేసీఆర్ ఇప్పుడు చెక్ పెట్టబోతున్నారని చెప్పొచ్చు.
తెలంగాణ జిల్లాలో పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. జిల్లా పర్యటనలకు సంబంధించి పార్టీ నేతలతో ఇదివరకే ఆయన చర్చించారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలంటే, ఇప్పట్నుంచే ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డట్టు సమాచారం. నిజానికి, హైదరాబాద్ పరిసర ప్రాంత గ్రామాల్లో వీలున్నప్పుడల్లా కేసీఆర్ పర్యటిస్తున్నారు. అయితే, కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాక పర్యటించాలని గతంలో అనుకున్నారు. కానీ, అప్పుడు అనుకున్న బస్సు యాత్ర కార్యరూపం దాల్చలేదు. రకరకాల కారణాలతో చివరి నిమిషంలో వాయిదా వేశారు. తాజా యాత్ర ఎప్పట్నుంచీ ప్రారంభం అవుతుందంటే.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న పోచంపాడు సభ జరిగిన తరువాత అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పర్యటనల్లో జిల్లాల వారీగా పెండింగ్ ఉన్న సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారిస్తారట. దీంతోపాటు వివిధ జిల్లాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను సందర్శించాలని భావిస్తున్నారు. అంతేకాదు, 2019లోపు కొన్ని ప్రాజెక్టులైనా త్వరితగతిన పూర్తవ్వాలంటే.. ఆయా ప్రాంతాలకు వెళ్లడమే సరైందని సీఎం అభిప్రాయపడుతున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. సీఎం జిల్లాల పర్యటనకు దిగడం ద్వారా పార్టీ వర్గాలతోపాటు, అధికారుల పనితీరులో కూడా మరింత చురుదనం వస్తుందని అనుకుంటారు. ఇక, రాజకీయంగా చూసుకుంటే.. ప్రగతి భవన్ కు మాత్రమే ముఖ్యమంత్రి పరిమితం అవుతున్నారన్న విమర్శలకు ఈ పర్యటనలతో చెక్ పెట్టినట్టు అవుతుంది. ఇంకో విశేషం ఏంటంటే… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జిల్లా పర్యటనలు తలపెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో కేసీఆర్ కూడా పర్యటనలకు శ్రీకారం చుట్టాలనుకోవడం విశేషం!