ఈవారం బాక్సాఫీసు దగ్గర ముక్కోణపు పోటీ చూడబోతున్నారు తెలుగు సినీ ప్రేక్షకులు. వరుస సెలవుల్ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మూడు సినిమాలూ ఒకేసారి బరిలో దిగబోతున్న సంగతి తెలిసిందే. జయ జానకి నాయక, లై, నేనే రాజు నేనే మంత్రి.. మూడింటిపైనా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ వారం ఏ సినిమాకి కలిసిరాబోతోంది? ఏది ప్రేక్షకుల మనసు గెలవబోతోంది? అనేది ఆసక్తిగా మారింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ మూడు సినిమాల ట్రేడ్ రిపోర్ట్ ఒక్కసారి ఆరా తీస్తే..
* లై
మూడు సినిమాలొచ్చినా ఓపెనింగ్స్ మాత్రం `లై`కే భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. ముగ్గురు హీరోల్లో నితిన్‌కే అభిమాన గణం ఎక్కువగా ఉంది. పైగా వరుస హిట్లతో జోరుమీదున్నాడు. ‘అ.ఆ’ సూపర్ హిట్ అవ్వడం, ఆ తరవాత విడుదల అవుతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు పెరిగాయి. పైగా పవన్ ఫ్యాన్స్ అండా, దండా… నితిన్ కే. ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది. సినిమా చూడాలన్న ఉత్సాహం కలుగుతోంది. అర్జున్ లాంటి స్టార్లు ఈ సినిమాలో ఉండడం, 14 రీల్స్ మేకింగ్ వాల్యూస్, హను రాఘవపూడిపై ఉన్న నమ్మకం ఈ సినిమాకి బాగా కలిసొచ్చే అంశాలు. కాకపోతే… విడుదలకు ముందు ఈ సినిమాపై కాస్త నెగిటీవ్ రిపోర్ట్ మొదలైంది. సినిమా సోసో గా ఉందని, ట్రైలర్‌లో చూపించినంత దమ్ము సినిమా మొత్తం కనిపించకపోవొచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నమాట.
* జయ జానకి నాయక
‘లై’ తరవాత ఆప్షన్… కచ్చితంగా జయ జానకి నాయకనే. ఎందుకంటే ఇది బోయపాటి శ్రీను సినిమా. ‘దమ్ము’ సినిమా మినహాయిస్తే… బోయపాటి నిరుత్సాహపరిచింది లేదు. పైగా యాక్షన్ అంశాలు వండి వార్చడంలో దిట్ట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ఈ దశలో ఓ విజయం కీలకం. ఈసినిమాపై భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. ఓ లవ్ స్టోరీకి బోయపాటి శైలి యాక్షన్ సన్నివేశాలు జోడించారు. ఇందులో ఏది క్లిక్ అయినా.. జయ జానకి నాయక విజయ ఢంకా మోగించడం ఖాయం. బోయపాటికి బ్యాక్ అప్ అదిరిపోయింది. రకుల్. జగపతిబాబు, శరత్‌కుమార్, నందు, వాణి విశ్వనాథ్… ఇలా చాలామందిని దించాడు బోయపాటి. దేవిశ్రీ సంగీతం – రిషి పంజాబీ కెమెరా పనితనం కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే.. బోయపాటి యాక్షన్ డోసు మించిందని, సెకండాఫ్‌లో సెంటిమెంట్ సీన్లు ఎక్కువ కనిపించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అవి క్లాస్ ఆడియన్స్‌ని ఏ మేరకు మెప్పిస్తాయన్నది చూడాలి.
*నేనే రాజు – నేనే మంత్రి
బాహుబలి తరవాత రానా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఆ తరవాత రానా నుంచి మరో సినిమా వస్తోందంటే అది టాక్ ఆఫ్ ది టౌన్ కాకుండా ఎలా ఉంటుంది? అందుకే ‘నేనే రాజు – నేనే మంత్రి’పై అందరి ఫోకస్ పడింది. పైగా ఇది తేజ సినిమా ఆయె. ప్రతీ కథనీ ఆచి తూచి ఎంచుకొనే నిర్మాత డి. సురేష్ బాబు తనయుడితో చేస్తున్న తొలి ప్రాజెక్ట్. అందుకే ఏ కోణంలోంచి చూసినా – ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించే అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్రైలర్ ఆసక్తిగా ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో తెలుగు సినిమాలేం రాలేదీమధ్య. అందుకే ఫక్తు కమర్షియల్ సినిమాల ముందు.. ఈ సినిమా కొత్తగానే కనిపిస్తుంది. పైగా తేజకు ఇప్పుడో హిట్ కొట్టి – తనని తాను నిరూపించుకోవడం అత్యవసరం. కాజల్ అందచందాలు, కేథరిన్ గ్లామర్, రానా నటన, తన ఇమేజ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. అయితే… సెకండాఫ్ భారంగా గడిచిందని, యాంటీ క్లైమాక్స్ కూడా కాస్త దెబ్బకొట్టే ప్రమాదం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.