బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నట్టు మంత్రి కెటిఆర్ చాలా ఆలస్యంగా నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తన స్వంత నియోజకవర్గం నేరెళ్లలో లారీ ప్రమాదం, ధగ్ధం కేసుకు సంబంధించి పోలీసుల చిత్రహింసలకు గురైన బాధితులను నెలరోజుల తర్వాత పరామర్శించారు. అన్ని హంగులూ అవకాశాలు వున్న వ్యక్తి ఇంత సమయం తీసుకోవవలసింది కాదు. తనకు స్థానిక నాయకత్వం సకాలంలో సమాచారం ఇవ్వలేదని ఆయన అంటున్నారు గాని వాస్తవానికి ఆ రోజునే స్వయంగా నేను పాల్గొన్న చర్చలోనే దీన్ని విమర్శించాం. ఎప్పట్లాగే నేను షెహన్షా నియోజకవర్గంలో జరిగినా జోక్యం చేసుకోకపోతే ఎలా అని వ్యాఖ్యానించాను కూడా. మీడియాలో సరే చాలా వ్యాసాలు వ్యాఖ్యలు ప్రతిపక్ష నేతల పర్యటనలూ సాక్షాత్తూ మీరాకుమార్ లాటి జాతీయ ప్రముఖుల రాక ఇన్ని జరిగాక ఇప్పుడు ఇలా అంటే ఎలా కుదురుతుంది? గతంలో ఒకసారి దీనిపై ఆయన ట్వీట్ చేశారు గాని రాజకీయ జవాబులకే పరిమితమైనారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ఆలస్యంగానైనా సరే జరిగింది దురదృష్టకరం అన్నాక ఇప్పుడు కెటిఆర్ వచ్చారు. పోలీసుల అత్యుత్సాహం కారణమని చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అయితే మాఫియా అన్న పదం వాడటమే పొరబాటని అంతగా సమర్థించాల్సిన అవసరం కనిపించదు. చాలా రకాల శక్తులు రంగంలో వున్నాయి. రాజకీయ బాధ్యత కూడా వహించవవలసి వుంటుంది.
మరో సంజాయిషీ హిమాన్షు మోటార్స్‌కు సంబంధించి. అది ఎప్పుడో మూతపడిందన్నట్టు కావాలంటే రాసిస్తానన్నట్టు గతంలో మాట్లాడారు. ఇప్పుడేమో సాంకేతికంగా తప్ప వాస్తవికంగా మూత పడినట్టేనని సర్దుబాటు చేశారు. ఇది కూడా పరోక్షంగా అంగీకరించడమే. కెటిఆర్ లాటి ముఖ్య నాయకులు మాట్లాడేప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలసిన అవసరాన్ని ఈ ఉదంతాలే చెబుతున్నాయి. రెండవది సకాలంలోస్పందించాలని గుర్తు చేస్తున్నాయి.