ఇంటగెలిచి రచ్చగెలవాలంటారు గాని అదేమంత తేలిక కాదని బిజెపి అద్యక్షుడు అమిత్ షా మరోసారి నిరూపించారు. ప్రధాని మోడీ సహచరుడుగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు రావడానికి వ్యూహ రచన చేసిన షా స్వంత రాష్ట్రంలో దెబ్బ తిన్నారు. అది కూడా ఆగర్భ శత్రువులాటి సోనియా సలహాదారు అహ్మద్ పటేల్‌ను రాకుండా చేయడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలం కావడం రాజకీయ శృంగభంగమే.శంకర్ సింగ్ వాఘేలా వర్గం తిరుగుబాటు, ఇతర చిన్న పార్టీలలోనూ చీలికలు, కర్ణాటకలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎల క్యాంపు నిర్వాహకుడైన మంత్రి శివకుమార్‌పై ఐటి దాడి ఇన్ని చేసిన తర్వాత కూడా పటేల్ ఎలాగో బయిటపడి రాజ్యసభకు తనతో పాటు వస్తున్నారంటే అమిత్ షాకు అది కుదుపే. రెండు ఓట్లు చెల్లకుండా చేయడం కోసం కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుకు అవకాశం ఇచ్చిన వారిలో షా ఒకరు. వాఘేలా వర్గానికి చెందిన ఇద్దరు ఎంఎల్‌ఎలు తమ ఓటును బిజెపి ఏజంటుతో పాటు అమిత్ షాకు కూడా చూపించారంటే ఆయన ఎంత అనాలోచితంగా దొరికిపోయారో అర్థమవుతుంది. డిసెంబరులో ఎన్నికలు జరగాల్సిన గుజరాత్‌లో ఇది కాంగ్రెస్‌కు వూపిరిపోస్తుంది. రాజ్యసభలో మొదటి సారి పెద్ద పార్టీగా వచ్చామన్న బిజెపి సంతోషానికి పగ్గాలు వేస్తుంది. ప్రమాదో ధీమతామపి అంటారు. ఎంత తెలివైన వారికైనా చిక్కులు తప్పవు మరి!