సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధికారంలోకి వస్తే బాగుంటుందని ఆకాంక్షించారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. తమాషాగా వుందా? కాని నిజమే. శుక్రవారం నాడు రాజ్యసభలో వీద్కోళ్ల పర్వం నడిచింది. సభాద్యక్షుడు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి ఈ రోజు బాద్యతలు ముగిస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత రెండు పర్యాయాలు ఆ పదవి నిర్వహించిన వ్యక్తి ఆయనే. దౌత్యవేత్తగా ఆయనకున్న అనుభవం తన విదేశీ పర్యటనల సమీక్షకు చాల ఉపయోగపడిందని ప్రధాని మోడీ అన్నారు. ఇక భిన్నాభిప్రాయానికి అవకాశం లేకపోతే ప్రజాస్వామ్యం నిరంకుశత్వంగా మారుతుందని అన్సారీ తన చివరి ప్రసంగంలో చెప్పారు. హడావుడిగా చట్టాలు రాకుండా నిరోధించి చర్చ చేయడంలో రాజ్యసభ పాత్ర కాపాడబడాలన్నారు.
సీతారాం ఏచూరి పదవీ కాలం కూడా ముగిసిన సందర్భంలో అరుణ్‌జైట్లీ ఆయన గురించి కూడా ప్రస్తావన చేశారు. తాము యూనివర్సిటీ రోజుల నుంచి సహాధ్యాయులమని గుర్తు చేస్తూ అప్పుడు కూడా ప్రతి చర్చలో ఆయన పాల్గొనేవారని అన్నారు. సభలో చర్చల స్థాయి పెరగడానికి ఏచూరి దోహదం చేశారని చెప్పారు.అయితే ఏచూరి ఎప్పుడూ అధికారంలో లేరు. కనక ఆదర్శదృక్పథంతో ప్రతిదానిపై ఆచరణ సాధ్యం గాని చాల సూచనలు చేస్తుంటారు. ఎప్పటికైనా ఆయన అధికారంలోకి రావాలని, వాస్తవిక దృక్పథం అలవడాలని కోరుకుంటాను అని చమత్కరించారు. ఏచూరి ఏదో ఒక పార్టీకే గాక దేశానికి నాయకుడని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రశంసించారు.