తెలుగు360.కామ్ రేటింగ్ 2.75/5
”వెయ్యి పంచ్‌లను ప్రాక్టీస్ చేసేవాడు కాదు
ఒకే పంచ్ వేయి సార్లు ప్రాక్టీస్ చేసేవాడే బలవంతుడు”
– బ్రూస్లీ
మనం ఎప్పుడూ మన బలంమీదే దృష్టి పెట్టాలి.. అని చెప్పడానికి బ్రూస్లీ మాటనే కోట్ చేస్తుంటారంతా.
బోయపాటి కూడా అదే నమ్మాడు. తన బలంమీదే దృష్టి పెట్టాడు. భద్ర, తులసి, సింహా, లెజెండ్, సరైనోడు.. కథ ఏదైనా, హీరో ఎవరైనా.. తల బలం, బలంగా ఎమోషన్ కంటెంటే! మరోసారి దానిపై ఫోకస్ చేసి తీసిన సినిమా `జయ జానకి నాయక`. ‘ఇది లవ్‌స్టోరీ..’ అంటూ కాస్త కోటింగు ఇచ్చాడు గానీ.. ఆ ‘కోటింగు’ మాత్రమే. లోపలంతా పక్కా మాస్.. ఊర మాస్! ఇంకాస్త లోలోపలకి వెళ్లిపోతే…
* కథ
స్వీటీ (రకుల్ ప్రీత్‌సింగ్) మంచి అమ్మాయి. అందంగా ఉంటుంది.. మనసూ గొప్పది. తనని ఓ సమస్య నుంచి బయటపడేసిన గగన్ (బెల్లంకొండ శ్రీనివాస్)ని ఇష్టపడుతుంది. గగన్కి నాన్న(శరత్‌కుమార్) అన్న (నందు) అంటే ప్రాణం. అయితే ఆ ఇంటికి ఆడదిక్కులేదు. అందుకే ఆ బాధ్యత తనే తీసుకొని – ఇంటినీ, ఆ ఇంట్లో మనిషుల్ని గాడిలో పెడుతుంది. గగన్ అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని ఆ ఇంటి కోడలుగా తీసుకొస్తుంది. దాంతో… ఆ ఇంట్లోవాళ్లంతా స్వీటీకి అభిమానులుగా మారిపోతారు. గగన్ కూడా స్వీటీపై ఇష్టం పెంచుకొంటాడు. అది ప్రేమగా మారుతుంది. స్వీటీ కూడా ప్రేమిస్తుంది. అయితే.. ఈ దశలో స్వీటీ జీవితంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. రెండు ముఠాల నుంచి ప్రమాదం ముంచుకొస్తుంది. అందులో అశ్వింత్ నారాయణ్ (జగపతిబాబు) పరువు కోసం ప్రాణాలు ఇచ్చే, తీసేంత మనిషి. అశ్విన్ పరువుకీ, స్వీటీకీ సంబంధం ఏమిటి? స్వీటీ అశ్వింత్ నారాయణ్‌కి ఏమవుతుంది..? అసలు స్వీటీకి వచ్చిన సమస్యేంటి? అందులోంచి గగన్ ఎలా కాపాడాడు? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
సినిమా టైటిల్, కొన్ని ప్రచార చిత్రాలు చూస్తే.. బోయపాటి మారాడేమో, కొత్తగా ఏమైనా ఆలోచిస్తున్నాడేమో, కొత్త కథ ఏమైనా చెబుతున్నాడేమో అనిపిస్తుంది. అయితే అక్కడక్కడ కాస్త అలాంటి ప్రయత్నం చేసినా.. వర్జినల్ బోయపాటి మాత్రం అలానే ఉన్నాడు ఏమాత్రం మారలేదు. రకుల్ ఎంట్రీ ఎంత ప్లజెంట్‌గా ఇచ్చాడో… బెల్లంకొండ శ్రీనుని పరిచయం చేసే సీన్ కి అంత వైలెంట్ టచ్ ఇచ్చాడు. రకుల్ -బెల్లంకొండ సీన్లలో ఏదో ఫ్రెష్‌నెస్ కోసం ప్రయత్నిస్తూ తడబడినా – ఆ మధ్యలో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం విశ్వరూపం చూపించేశాడు. జగపతిబాబు ఎంట్రీ, ఇంట్రడక్షన్, ఆ సీన్లూ చూస్తుంటే… జగపతిబాబు అరివీరభయంకరమైన విలనిజం ఈసినిమాలో చూడబోతున్నామా అనిపిస్తుంది. అయితే క్రమంగా విలన్ మారిపోతాడు. కథ మరో టర్న్ తీసుకొంటుంది. విశ్రాంతి ముందొచ్చే యాక్షన్ ఘట్టం బాగుంది. ఆ ట్విస్టు కూడా.. షాకింగ్‌గానే ఉంటుంది. ద్వితీయార్థంలో కేవలం కథపైనే ఫోకస్ పెట్టాడు దర్శకుడు.
పంతానికీ, పరువుకీ, ప్రేమకీ నలిగిపోయే ఓ అమ్మాయి కథ చుట్టూ సాగిన సన్నివేశాలు, యాక్షన్ ఘట్టాలు మాస్‌ని మెప్పించేలా ఉన్నాయి. హంసల దీవిలో తీసిన ఫైట్ మాత్రం కళ్లు చెదిరిపోయేలా ఉంది. అక్కడ్నుంచి కథలో టెంపో… ఇంకా ఇంకా పెరగాల్సింది. కానీ అంత ఫైట్ చూశాక.. ఆ తరవాత ఏం చూసినా కళ్లకు ఆనదు. ఆఖరికి క్లయిమాక్స్ ఫైట్‌తో సహా. దాంతో ఏదో కాస్త వెలితి ఫీలవుతాడు ప్రేక్షకుడు. కాకపోతే బోయపాటి తాలుకూ అతి అక్కడక్కడ కనిపిస్తుంది. మితిమీరిన యాక్షన్ దృశ్యాలు కాస్త ఇబ్బంది పెట్టేవే. కానీ.. మాస్‌కి అవే నచ్చుతాయని బోయపాటి గత సినిమాలే రుజువు చేశాయి. బోయపాటి ధైర్యం కూడా అదే కాబోసు. చాలా పెద్ద కాన్వాస్ ఉన్న కథ ఇది. కథలో టెంపో పోకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. కాకపోతే.. యాక్షన్ సన్నివేశాల మధ్య కథ సాగినట్టు అనిపిస్తుంది.
* నటీనటుల ప్రతిభ
ఇది బెల్లంకొండ శ్రీనివాస్ సినిమానో, రకుల్ సినిమానో కాదు. అచ్చంగా బోయపాటి శ్రీను సినిమా. దానికి తగ్గట్టే ప్రతీ పాత్రనీ బోయపాటి ఆవహించినట్టు అనిపిస్తుంటుంది. వాళ్లంతా బోయపాటి కి తగ్గట్టుగానే నటన ప్రదర్శించారు. శ్రీనివాస్ హుషారు డాన్సులకు, ఫైటింగులకే పరిమితమైంది. డైలాగులు తక్కువ. ఉతుకుడు ఎక్కువ. దాదాపుగా ఓకే రకమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. ‘ఇది తప్ప ఏదీ రాదా ‘అంటూ రకుల్ చేత ఓ డైలాగ్ చెప్పించాడు బోయపాటి. సేఫ్ సైడ్‌గా. అయితే యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఇరగదీశాడు. క్లైమాక్స్‌లో డైలాగులు కూడా బాగానే పలికాడు. రకుల్ ప్రీత్ సింగ్ తనలోని రెండు రకాల షేడ్స్ చూపించింది. ఫస్టాఫ్ చలాకీగా సీతాకోకచిలుకలా కనిపించి… రెండో భాగంలో పంజరంలో చిలుక అయిపోయింది. రకుల్ ఇంతగా ఏడ్చిన సినిమా మరోటి లేదు. ప్రగ్యా ఓ పాటకు కొన్ని సన్నివేశాలకే పరిమితం. కేథరిన్ ఐటెమ్ పాటతో ఊపు తెచ్చింది. జగపతిబాబు కనిపించిన ప్రారంభ సన్నివేశాలు చూస్తే.. ఇది మరో లెజెండ్ అనిపిస్తుంది. ఎందుకనో ఆ పాత్ర ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తుంది. శరత్ కుమార్ డీసెంట్‌గా నటించాడు. వాణీ విశ్వనాథ్‌ని సరిగా వాడుకోలేదు.
* సాంకేతికత
దేవిశ్రీ ప్రసాద్ ఆర్.ఆర్ అదిరిపోయింది. పాటలు బాగున్నాయి. వాటిని పిక్చరైజ్ చేసిన పద్ధతీ బాగుంది. ఏ ఫర్ యాపిల్ సందర్భానికి తగ్గట్టుగా రాకపోయినా. థియేటర్లో హుషారు తెప్పిస్తుంది. రిషి పంజాబీ కెమెరా పనితనం వల్ల నిర్మాత పెట్టిన ఖర్చు పైసాకి పది పైసలు తెరపై కనిపిస్తాయి. ఆడవాళ్ల గురించి చెప్పిన డైలాగులు బాగా పేలాయి. బోయపాటి మరోసారి యాక్షన్ సన్నివేశాల్లో తన దమ్ము చూపించాడు. అయితే దానికి ముందూ వెనుకా.. కాస్త తడబడ్డాడు. బలమైన కథ లేకపోయినా… పాత్రధారులతో కథలో, పాత్రల్లో బలం తీసుకురావడానికి ప్రయత్నించాడు. బోయపాటి సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు ఫుల్స్మీల్స్ పెట్టినట్టే. మరోసారి వాళ్లను అలరించే సినిమా తీశాడు.
* ఫైనల్ టచ్ : మాస్ ఆడియన్స్‌కి ఈ నాయకుడే.. సరైనోడు
తెలుగు360.కామ్ రేటింగ్ 2.75/5