తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతిపక్షాలకూ మధ్యన సంఘర్షణ సాగుతూనే వుంది. ఒక విధంగా కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షంగానూ సిపిఎంను సమరశీల ఉద్యమ పక్షంగానూ పరిగణిస్తున్న ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు తీవ్ర విమర్శలు గుప్పించడం చూస్తుంటాం. కాని ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని జెఎసి పట్ల మరింత ఆగ్రహంతో స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో వారి ధర్నాకు అనుమతించకపోవడం, తలుపులు బద్దలు కొట్టి ఆయనను అరెస్టు చేయడం తీవ్ర విమర్శకు కారణమైంది. తర్వాత కాలంలో కోదండరాం కూడా స్వరం పెంచారు.ఫాం హౌస్‌లో జల్సాలు చేస్తున్నట్టు ఆయన ఆరోపిస్తే కెసిఆర్ పేరెత్తకుండా ఖండించారు. ఇతరులు ప్రత్యేకంగా సమాధానమిచ్చారు. ఇప్పుడు అమరవీరుల స్పూర్తియాత్ర పేరిట కోదండరాం తలపెట్టిన యాత్రను కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. వారి టెంటు కూడా కూల్చివేయబడింది. ఆయనను కార్యకర్తలను అరెస్టు చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. తర్వాత హైదరాబాదుకు తరలించారు. మేమైతే యాత్ర ఆపేది లేదని కోదండరాం ప్రకటించారు. జెఎసి, కాంగ్రెస్ జట్టుకడతాయని సిపిఐ కూడా వారిని బలపరుస్తుందని ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. కాంగ్రెస్ నాయకులపై రాజకీయ విమర్శలు చేసినట్టు కోదండరాంపై చేసే అవకాశం వుండదు గనకే టిఆర్ఎస్ అసలు అనుమతించకుండానే అడ్డుపడుతుందని ఒక అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. అందులో నిజానిజాలు ఏమైనా సరే అణచివేత చర్యలు ఎక్కువైనాయన్న అభిప్రాయం మాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యమూ కాదు.