తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నారు. అన్నీ సిద్ధం చేసుకున్నారు. ప్రయాణానికి అనుగుణంగానే పోచంపాడు బహిరంగ సభకు హాజరయ్యారు. అనుకున్న సమయం కంటే కాస్త ముందుగానే ఆయన ప్రసంగం మొదలుపెట్టేశారు. సాయంత్రానికి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. కానీ, అనూహ్యంగా ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నారు! అయితే, ఉన్నట్టుండి ఈ టూరు ఎందుకు రద్దయిందీ అనేదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయం అవుతోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తానని ఆయన ముందే చెప్పారు. కానీ, హాజరు కాలేదు! ఢిల్లీలో అందుబాటులో ఉన్న తెరాస ఎంపీలు ఈ కార్యక్రమానికి వెళ్లాలని సూచించారు. దీంతో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లకపోవడానికీ… జీఎస్టీపై కేంద్రంతో తెరాస పోరాటానికీ ఏదైనా సంబంధం ఉందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వాడీవేడిగా జరుగుతోంది.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో కొన్ని మినహాయింపులను కేసీఆర్ కోరుతున్న సంగతి తెలిసిందే. ప్రజల ప్రయోజనాల కోసం చేపడుతున్న ప్రాజెక్టులపై పన్ను తగ్గించాలంటూ ఆయన పట్టుబడుతున్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న భారాన్నంతా శాఖల వారీగా లెక్కగట్టి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ రాయాలని అనుకున్నారు. పన్ను భారాన్ని కేంద్రానికి వివరించే ప్రయత్నం చేద్దామనీ, లేఖ రాసిన తరువాత ప్రధాని నుంచి వచ్చే స్పందన చూసుకుని, ఆ తరువాత న్యాయ పోరాటం గురించి ఆలోచిద్దామని కూడా ఈ మధ్యే చెప్పారు. అయితే, ఇంతవరకూ ఆ లేఖ రాసే ప్రయత్నాలు జరగలేదు! ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్తే ప్రధానితోపాటు, ఆర్థికమంత్రిని కూడా కలిసి పన్ను భారంపై చర్చిస్తారని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఏకంగా టూరే రద్దు చేసుకున్నారు. దీంతో కేసీఆర్ వ్యూహం ఏదైనా ఉందా అనేది చర్చనీయం అవుతోంది.
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రద్దు వెనక రెండు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో పోరాటానికి సిద్ధం అని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు ఆగ్రహించి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి! భాజపా సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ పన్నుపై వీలైతే సూచనలు చేయాలిగానీ, న్యాయ పోరాటం అంటే భాజపా సహించే పరిస్థితి ఉండదు కదా! ఇక, రెండో అభిప్రాయం ఏంటంటే.. ఇంకా లేఖ కూడా రాయలేదు కాబట్టి, ఇలాంటి పరిస్థితిలో ఢిల్లీకి వెళ్లకుండా ఉంటేనే వ్యూహాత్మకంగా ఉంటుందని ఆయన భావించి ఉంటారా అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే, ఢిల్లీ టూరు రద్దుకు గల కారణాలను ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇంతవరకూ ప్రకటించకపోవడం గమనార్హం.