రాజ్యసభ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ పార్టీ మారతారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఊహాగానాలపై రకరకాల విశ్లేషణలు కూడా వినిపించాయి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్నారు కాబట్టి, ఆ పార్టీ నేతలతో ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనీ, ఆ మార్గంలోనే ఆయన పార్టీ మారే ప్రయత్నంలో ఉన్నారనే అభిప్రాయాలు వినిపించాయి. తెరాసలో తనకు లభిస్తున్న గుర్తింపు చాలడం లేదనీ, వచ్చే ఎన్నికల్లో తన కుమారుడుకి నిజామాబాద్ అర్బన్ టిక్కెట్ ఇవ్వాలనే డిమాండ్ ను ముఖ్యమంత్రి ముందు ఉంచారట. అయితే, ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటూ తేల్చకపోవడంతో డీఎస్ తీవ్ర అసంతృప్తికి లోనౌతున్నట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సొంత గూటికి తిరుగు పయనమౌతున్నట్టుగా ప్రచారం మొదలైంది. ఈ చర్చ బాగా పెరుగుతూ ఉండటంతో డీఎస్ కాస్త ఘాటుగానే స్పందించారు.
తాను కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో వదులుకున్నాననీ, వెనక్కి వెళ్లే ఆలోచనే లేదని గతంలో కూడా స్పష్టంగానే చెప్పాననీ, అయినాసరే ఇంకా ఇలాంటి పుకార్లు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని డీఎస్ మండిపడ్డారు. వ్యక్తుల గౌరవాలు, పరపతి, పరువు ప్రతిష్ఠలతో ఆట్లాడుకోవడం ఏమాత్రం సరైంది కాదన్నారు. ఇది పాత్రికేయ విలువలకు విరుద్ధమైన చర్య అంటూ క్లాస్ తీసుకున్నారు. తాను అందరికీ అందుబాటులోనే ఉంటున్నాననీ.. ఇలాంటి విషయాల గురించి తనను నేరుగా అడిగితే చెబుతాను కదా అన్నారు. తన వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నట్టుగా ఉందని డీఎస్ ఆరోపించారు. దీంతో డీఎస్ పార్టీ మార్పు చర్చ ఇక్కడితో ఆగే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.
అయితే, ఈ వ్యవహారంపై టి. కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు మరోలా ఉన్నాయట. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా హై కమాండ్ ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తెలంగాణ వ్యవహారాల బాధ్యతల నుంచి దిగ్విజయ్ సింగ్ ను తప్పించారు. మరిన్ని మార్పులూ చేర్పులూ తథ్యం అంటున్నారు. ఇతర పార్టీల్లో ఉంటున్న మాజీ కాంగ్రెస్ నేతలకు ఆహ్వానాలు పంపాలని అధిష్టానం భావిస్తోందనీ, ఆ క్రమంలోనే డీఎస్ కి పిలుపు వెళ్లి ఉండొచ్చనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. డీఎస్ కుమారుడు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానం భరోసా ఇచ్చేలా సంకేతాలు వెలువడ్డాయనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. అయితే, తాజా డీఎస్ స్పందన ప్రకారం చూస్తుంటే… ఆయన పార్టీ మారే అవకాశాలు లేనట్టుగానే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి.