తెలంగాణ, ఎపిలలో పాలకపక్షాలు రకరకాల కార్పొరేషన్ల చైర్మన్లు, సలహాదారుల పేరుతో అస్మదీయులను నియమించడం అనంతంగా సాగిపోతున్నది. ఎంఎల్‌ఎలు కాలేని ఎంఎల్‌సిలుగా అవకాశం రాని వారికి పునరావాస వేదికలుగా ఇవి గొప్పగా ఉపయోగపడుతున్నాయి. ఈ పదవులలో చాలా భాగం పైకి మామూలుగా కనిపించవచ్చు గాని నియామకాల తర్వాత వారికి భారీ పారితోషికాలు ముడుతుంటాయి. లక్షన్నర, రెండు లక్షలు ఇలా అన్నమాట. అదే కోవలో ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యుల జీతాలు ఏక్‌దమ్మున 281 శాతం పెరగడం విశేషం. చైర్మన్ జీతం 80వేల రూపాయల నుంచి 2లక్షల 25 వేలకు పెరిగింది. సభ్యుల జీతం 79 వేల నుంచి 2,24వేలకు పెరిగింది. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఇప్పుడు చైర్మన్‌గానూ, విఠల్ తదితరులు సభ్యులుగానూ వున్న సంగతి తెలిసిందే. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ పెరుగుదల అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు రంగం మాట ఎలా వున్నా ప్రభుత్వాలలో ఈ పెంపుదల బాగా ఎక్కువే. సాంకేతిక కారణాలు ఏమైనా సరే ఈ పెంపుదలపై విమర్శలు బాగానే వినిపించాయి.ఈ పెంపుదల కూడా 2016 జనవరి నుంచి వరిస్తాయన్నారు గనక 19 నెలల బకాయిలూ వస్తాయట. గుడ్‌లక్. జీతాలు పెరిగాకనైనా కమిషన్ ఉద్యోగాల భర్తీపై దృష్టి పెంచితే బాగుంటుందని నిరుద్యోగ యువత కోరుతున్నది.