తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మార్పులూ చేర్పులూ ఉంటాయంటూ ఈ మధ్య కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ వ్యవహారాల బాధ్యతల నుంచి దిగ్విజయ్ సింగ్ ను తప్పించడం వెనక ఓ వర్గం తీవ్రంగా కృషి చేసిందనే వ్యాఖ్యలూ వినిపించాయి. దీంతో రాష్ట్ర పీసీసీలో కొన్ని మార్పులు ఉంటాయని అనుకున్నారు. నిజానికి, పీసీసీ పదవి మార్చాలనే డిమాండ్ చాన్నాళ్లుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరనే చర్చ కూడా ఈ మధ్య బాగా జరుగుతూనే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కలిసికట్టుగా ఉండాల్సిన కాంగ్రెస్ నేతలు, వ్యక్తిగత ప్రజయోనాల కోసం, పదవుల కోసం పాకులాడుతున్నారనే విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొత్తగా నియమితులైన పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్ర కుంతియా వచ్చారు. రాష్ట్ర నేతలకు అధిష్టానం పంపిన సందేశాలను తీసుకుని వచ్చారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పదవుల్లో ఎలాంటి మార్పులూ చేర్పులూ ఇప్పట్లో ఉండవని స్పష్టం చేశారు. 2019 వరకూ పీసీసీతో సహా పార్టీ పదవుల్లో మార్పులు ఉండవని చెప్పారు. అధిష్టానం కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పిందనీ, పదవుల్లో మార్పులు ఉంటాయంటూ ఈ మధ్య వినిపిస్తున్న ఊహాగానాల్లో నిజం లేదనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా రాష్ట్ర కాంగ్రెస్ పయనిస్తోందని కుంతియా అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో లేకపోవడం వల్ల నాయకులకు స్వేచ్ఛ ఎక్కువైందనీ, దాన్ని త్వరలోనే అదుపు చేయబోతున్నామని కూడా కుంతియా వ్యాఖ్యానించడం విశేషం. పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఉండటం లేదంటూ వినిపిస్తున్న వాదనను కూడా కొట్టి పారేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చూస్తే.. అన్ని వర్గాలకూ ఇస్తున్న ప్రాధాన్యత అర్థమౌతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్టుగా చెప్పారు.
మొత్తానికి, కొంతమంది కాంగ్రెస్ నేతలకు కుంతియా వ్యాఖ్యలు బాగా తగిలే అవకాశం ఉంది. పీసీసీ మార్పు ఉండదంటూ స్పష్టం చేయడం ద్వారా కోమటిరెడ్డి సోదరులకు సమాధానం చెప్పినట్టయింది. ఆ ప్రయత్నాలు మానుకోవాలని చెప్పినట్టే కదా! ముఖ్యమంత్రి పదవి రేసు గురించి మాట్లాడుతున్న నేతలకు కూడా ‘పార్టీలో స్వేచ్ఛ ఎక్కువైందనీ, దాన్ని తగ్గిస్తామ’ని వ్యాఖ్యానించడం ద్వారా చెక్ పెట్టినట్టయింది. బీసీ నేతనైన తనకు పార్టీలో న్యాయం జరగడం లేదంటూ ఈ మధ్య ఓ ప్రముఖ నేత ఆఫ్ ద రికార్డ్ వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు కూడా కుంతియా వ్యాఖ్యల్లో సమాధానం ఉంది. ఎవరికి ఏది ఎలా చెప్పాలో చెప్తూనే.. తాను ఆదేశాలు ఇవ్వడానికి రాష్ట్రానికి రాలేదనీ, అధిష్టానం అభిప్రాయాలను మాత్రమే తీసుకొచ్చాననీ, పార్టీ కోసం ఒక సాధారణ కార్యకర్తగా పనిచేస్తానని కుంతియా ముక్తాయించారు. మొత్తానికి, రాష్ట్ర కాంగ్రెస్ నేతల కప్పగంతుల ధోరణికి అధిష్టానం చెక్ పెట్టే ప్రయత్నంలో ఉందని అర్థమౌతోంది. ఈ విషయంలో అధిష్టానం వైఖరి కఠినంగా ఉంటుందనేది స్పష్టం. మరి, కుంతియా వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ లో ఎలాంటి స్పందన ఉంటుందో వేచి చూడాలి.