నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రకరకాల అంచనాలూ నమ్మకాలు తెరమీదికి వస్తున్న కథనాలూ చూస్తున్నాం. నంద్యాలలో గెలుపొందిన పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉంటుందనీ, ఒక్క సందర్భంలో తప్ప ఈ సెంటిమెంట్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, సర్వేల సంగతి చెప్పాల్సిన పనిలేదు. పరిస్థితి తమకే అనుకూలంగా ఉందంటూ ఎవరి సర్వేలు వారికి ఉన్నాయి. కులాల లెక్కలు, సామాజిక సమీకరణాల, మతాల మతలబులు.. ఇలా రకరకాల ఓటు బ్యాంకుల లెక్కలు కూడా తెరమీదికి వస్తున్నాయి. ఏదేమైనా, అధికార ప్రతిపక్షాలకు ఈ ఉప ఎన్నిక నల్లేరు మీద నడక అయితే కాదనేది అర్థమౌతోంది. ఈ పరిస్థితి బెట్టింగు రాయుళ్లకు అనుకూలంగా మారినట్టు సమాచారం.
నంద్యాల ఉప ఎన్నికపై భారీ బెట్టింగులు జరుగుతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. విజయవాడలో ఈ జోరు కాస్త ఎక్కువగానే ఉందని టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తూ ఉండటం విశేషం. విజయవాడలో బాగా పెరున్న ఓ టీడీపీ నేత భారీ బెట్టింగులు వేశారనీ, వైకాపా నేతలు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదంటూ అక్కడ ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ నంద్యాలపై బెట్టింగులు బాగా జరుగుతున్నాయట. కుల సమీకరణాల ఆధారంగానే ఈ బెట్టింగులు సాగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కులాల ప్రాతిపదిక తెరమీదకి రావడంతో చాలామంది పంతాలకు పోయి మరీ బెట్టింగులకు దిగుతున్నట్టు అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నిక వేడి ఆంధ్రాకి మాత్రమే పరిమితం కాలేదు! హైదరాబాద్ లో కూడా ఈ ఎన్నికలపై బెట్టింగులు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు.
నిజానికి, నంద్యాల గెలుపుపై రెండు పార్టీలూ ధీమాతో లేనట్టుగానే కనిపిస్తున్నాయి. ఎవరికివారు అభద్రతా భావంతో ఉండబట్టే… టీడీపీ మంత్రులు నంద్యాలలో తిష్టవేశారు, జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడే ఉంటూ రోడ్ షోలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇదే నాంది అని రెండు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే, ప్రస్తుత ఉప ఎన్నిక వైకాపా, టీడీపీల మధ్య జరుగుతున్నట్టుగా లేదనీ.. ప్రభుత్వం, వైకాపా మధ్య జరుగుతున్నట్టుగా ఉందని ఓ ప్రముఖ టీడీపీ నేత ఆఫ్ రికార్డ్ చెప్పారు. ఈ పరిస్థితి ఎవరికైనా అడ్వాంటేజ్ గా మారిందీ అంటే.. అది బెట్టింగు రాయుళ్లకు మాత్రమే అని కూడా ఆయన చమత్కరించారట. అంటే, బెట్టింగులు ఏ స్థాయిలో ఉన్నాయనేది చెప్పకనే చెప్పినట్టు. ఓ అంచనా ప్రకారం దాదాపు రూ. 100 కోట్లు మేర బెట్టింగులు జరిగాయనీ, ఈ సంఖ్య ఐదారింతలు అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కొంతమంది అంటున్నారు.