మహేష్ బాబు దగ్గర్నుంచి బోల్డన్ని సినిమా కబుర్లు వినొచ్చు. ఓవైపు `స్పైడర్` విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు `భరత్ అను నేను` షూటింగ్ జరుగుతోంది. ఈలోగా మహేష్ తన 25వ చిత్రానికి శ్రీకారం చుట్టేశాడు. ఈరోజు ఉదయం మహేష్ – వంశీపైడిపల్లి సినిమా లాంఛనంగా మొదలైపోయింది. వంశీపైడిపల్లి కథ, కథనాలు, మేకింగ్ వైవిధ్యంగానే ఉంటాయి. ఈసారి ఎలాంటి జోనర్ ఎంచుకొన్నాడా? అనే ఆసక్తి నెలకొంది. ‘స్పైడర్’ మురుగదాస్ స్టైల్లో సాగే కమర్షియల్ సినిమా. `భరత్ అను నేను` కూడా కొత్త జోనర్లో సాగే కథే. అందుకే ఈసారి ప్రయోగాలకు పోకూడదని మహేష్ భావించాడట. దాంతో.. స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ కథే ఎంచుకొన్నారని తెలుస్తోంది. మహేష్ మాస్ సినిమా చేసి చాలా కాలమైంది. ఈసారి.. ఆ జోనర్లో సాగే కథ అని, యాక్షన్ సీన్లకు అధిక ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. వంశీపైడిపల్లిపై హాలీవుడ్ ప్రభావం ఎక్కువ. ఎవడు?, ఊపిరిసినిమాలకు మూలం అక్కడి నుంచే తీసుకొన్నాడు. ఈసారీ ఓ హాలీవుడ్ కథకు…. తనదైన శైలిలో ‘తెలుగు’ మెరుగులు దిద్దాడట. మరి ఆ సినిమా ఏంటో చూడాలి.