సినీ పరిశ్రమలో చక్రం తిప్పిన వాళ్లు రాజకీయాల్లో చేరి – పదవులతోనో, ప్రజా సేవలతోనో టచ్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్న యాక్షన్ కింగ్ అర్జున్ మాత్రం ‘నేను రాజకీయాలకు దూరం’ అంటున్నాడు. పొరపాటున కూడా రాజకీయాల్లో చేరనని చెబుతున్నాడు. ”రాజకీయాలంటే నాకు ఆసక్తి లేదు. వాటి గురించి ఏమాత్రం తెలీదు. రాజకీయ నేపథ్యంలో కొన్ని చిత్రాల్లో నటించానంతే. ఆ మాత్రాన రాజకీయాలంటే నాకు ఇష్టం ఉందని అనుకోవొద్దు. తెరపై రాజకీయాలు చూపించడానికి బాగానే ఉంటాయి. దిగితే గానీ లోతు తెలీదు” అంటున్నాడు అర్జున్. నటుడిగా 150 చిత్రాల మార్క్ అందుకొన్న అర్జున్ ఇటీవల విడుదలైన ‘లై’లో ప్రతినాయకుడిగా కనిపించాడు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అన్నట్టు అర్జున్ మంచి దర్శకుడు కూడా. తన కుమార్తెని కథానాయికగా చేస్తూ… ఓ సినిమాని రూపొందిస్తున్నాడు. అయితే ఇది అర్జున్ స్టైల్లో సాగే యాక్షన్ సినిమా కాదు. ఓ ప్రేమకథ అట. ”సినిమా రంగం నాకు చాలా ఇచ్చింది. పరిశ్రమ అంటే నాకు గౌరవం. అందుకే నా కుమార్తెనీ కథానాయికగా చూడాలనుకొంటున్నా. కథానాయకుడిగా నటించినా, ప్రతినాయకుడిగా కనిపించినా.. మంచి నటుడిగా గుర్తింపు పొందడంలోనే ఎక్కువ ఆనందం అనుభవిస్తా. ప్రయోగాలు చేయడానికి సరైన సమయం ఇదే. ఇక మీదటా.. నా శక్తి మేర కొత్త పాత్రల్లో కనిపిస్తా” అంటున్నాడు యాక్షన్ కింగ్.