హీరో గుడ్డివాడు.. అంటూ ఓ కథ చెప్పాలని ప్రయత్నిస్తే… అదేదో ఆర్టు ఫిల్మ్, అవార్డు ఫిల్మ్ అనుకొనేవారు అప్పట్లో. ఈ కాన్సెప్ట్‌తో ఓ కమర్షియల్ సినిమా తీయొచ్చు అని నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నాడు అనిల్ రావిపూడి. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’ ఆయనే దర్శకుడు. టైటిల్, కాన్సెప్ట్ బాగున్నాయి – మరి… రవితేజని ఎలా చూపిస్తాడో, ఆ పాత్రలో రవితేజ ఎలా ఇమిడిపోతాడో అనుకొన్నారంతా. అయితే… ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ రాజా ది గ్రేట్ టీజర్ వచ్చేసింది. తొలి డైలాగ్‌లోనే రవితేజ స్టైల్ ఆఫ్ పంచ్ పడిపోయింది. ఇదో కళ్లు లేని వ్యక్తి కథ.. అనేది చెప్పేశారు. `ఐ యామ్ బ్లైండ్ బట్ వెల్ ట్రైన్డ్` అనే సింగిల్ లైన్‌తో.. రవితేజ క్యారెక్టరైజేషన్ అర్థమైపోయింది. ఈ పాయింట్ చుట్టూ.. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ జోడించేశాడు అనిల్ రావిపూడి. టేకింగ్, పిక్చరైజేషన్, రవితేజ లుక్ అన్నీ కనులకు ఇంపుగా కనిపిస్తున్నాయి. కొత్త తరహాగా సాగే కమర్షియల్ చిత్రాలకు రాజా ఊపిరి పోసేలా ఉన్నాడు.