తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరమైన దశలో ఉన్నాయి. ముఖ్యమంత్రి పళని స్వామి నేతృత్వంలోని శిబిరం, పళని స్వామి నేతృత్వంలోని మరో శిబిరం విలీన ప్రక్రియ కీలక దశకు చేరుకున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు వర్గాలను కలిపే క్రమంలో కేంద్రంలోని అధికార పార్టీ భాజపా పెద్దన్న పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చించేందుకు ఇప్పటికే పన్నీరు సెల్వమ్ ప్రధానిని ఓసారి కలిసి వెళ్లారు. ఆ తరువాత, పళని స్వామి కూడా ఈ మధ్యనే ప్రధానిని కలిసి వచ్చారు. తాజాగా మరోసారి మోడీని పన్నీర్ కలుసుకోవడం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను ప్రధానికి వివరించడం కోసమే పన్నీరు ఢిల్లీకి వెళ్లినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. సర్కారు ఎదుర్కొంటున్న సవాళ్లతోపాటు, రాష్ట్రంలోని మరికొన్ని సమస్యపై ప్రధానితో చర్చించినట్టు చెప్పారు. ఇక, విలీనం విషయానికి వచ్చేసరికి… తమిళ ప్రజలు, అన్నా డీఎంకే వర్గాలు ఆశిస్తున్నట్టుగానే, అందరికీ మేలు జరిగే విధంగానే ఉంటుందని పన్నీర్ చెబుతున్నారు. విలీన ప్రక్రియ ఏ దశలో ఉందనే విషయాన్ని చెప్పకుండా ఇలా దాటేశారు! రాష్ట్రంలో తాజా పరిస్థితులను ప్రధానికి చెప్పడం కోసమే కలిశాననీ, అంతకుమించి ఎలాంటి రాజకీయ చర్చల్లేవని అన్నారు. అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం… పళని స్వామి తీరుపై ఫిర్యాదు చేసేందుకే పన్నీరు ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తోంది. రెండు వర్గాల విలీన ప్రక్రియపై పళని కొన్ని షరతులు పెడుతున్నారనీ, కొన్ని పదవుల త్యాగానికి సిద్ధపడం కావడం లేదనీ, తమ వర్గానికి కావాల్సిన పదవుల విషయంలో కూడా పట్టువిడుపు ధోరణి ప్రదర్శంచడం లేదని ప్రధానికి పన్నీరు చెప్పారట.
ఇదిలా ఉంటే.. ఈ రెండు వర్గాల విలీనంలో ప్రధానమంత్రి జోక్యం ఉండదని రాజ్యసభ ఎంపీ మైత్రేయన్ చెప్పడం విడ్డూరం! ఇతర రాజకీయ పార్టీల అంతర్గత వ్యవహారాల్లో నరేంద్ర మోడీ ఎలా జోక్యం చేసుకుంటారనీ, ఈ భేటీని రాజకీయ కోణం నుంచి చూస్తూ వక్రీకరించడం చాలా సులువైన పని అని మీడియాకు క్లాస్ తీసుకున్నారు. రెండు వర్గాల విలీన ప్రక్రియలో ప్రధాని పాత్ర ఉందనే ప్రచారాన్ని ఇక్కడితో ఆపెయ్యాలని ఆయన అన్నారు! నిజానికి, తమిళనాడులోని అన్నాడీఎంకే వర్గాల విలీనం ఎవరికి అవసరమో అందరికీ తెలిసిందే! ఒకవేళ ఈ వర్గాల విలీన ప్రక్రియ భాజపాకి అవసరం లేకపోతే… ఎప్పటికప్పుడు పన్నీరు, పళనిలు ప్రధానిని కలవాల్సిన అవసరం ఏముంటుంది..? వారు కోరినప్పుడల్లా అపాయింట్మెంట్లు ఇవ్వాల్సిన పనేముందుంటుంది..? రెండు వర్గాల విలీన విషయంలో పళని స్వామి షరతులు పెడుతున్నట్టు తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు భాజపా పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరమైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ పెద్దలు ఆశిస్తున్నది కూడా అదే కదా!