నంద్యాల ఎన్నికలపై ఇప్పటికే రకరకాల సర్వేలు అంటూ ప్రచారంలోకి వచ్చాయి. అయితే, వీటి గురించి ప్రజలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. ఎంత సశాస్త్రీయంగా చేసిన సర్వే అయినా ‘నిజం ’అనే నమ్మకం లేకుండాపోయింది! ఆ పరిస్థితికి రాజకీయ పార్టీలే కారణం అనడంలో సందేహం లేదు. టీడీపీ వర్గాలు చేసుకున్న సర్వేలో ఆ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. అలాగే, వైకాపా చేయించుకున్న సర్వేలో ఆ పార్టీ గెలుపు ఖాయమనే ఉంటుంది. నంద్యాల ఉప ఎన్నిక దగ్గరపడుతున్న ఈ తరుణంలో వైకాపా, టీడీపీలు యథావిధి సర్వేలు చేయించుకున్నట్టు సమాచారం. రొటీన్ గా తమ అభ్యర్థులే గెలిచే పరిస్థితి ఉందంటూ ఫలితాలు వచ్చాయి. అయితే, మెజారిటీ విషయంలో రెండు సర్వేలూ దాదాపు ఒకే సంఖ్య బయటపెట్టడం విచిత్రం!
నంద్యాలలో తాజాగా వైకాపా ఓ సర్వే చేయించుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఈ సర్వే ప్రకారం వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలుపు ఖాయమనీ, 10 నుంచి 15 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని తేలిందట! ఇక, టీడీపీ సర్వే ప్రకారం ఆ పార్టీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి గెలుస్తారనీ, 15 నుంచి 18 వేల ఓట్లు మెజారిటీ వస్తుందని తేలిందట. ఈ నివేదికను మంత్రి భూమా అఖిల ప్రియ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారని సమాచారం. ఈ మాత్రం మెజారిటీ చాలదనీ, ఈ నంబర్ మారే అవకాశాలుంటాయనీ, ఇంకా పెంచే దిశగా పార్టీ శ్రేణులు కష్టపడాలని ఆయన చెప్పారట. భూమా అఖిల ప్రియ తాజా ప్రసంగాల్లో వినిపించే ధీమాకు ఈ సర్వే కారణమని చెబుతున్నారు. తాను ఇప్పుడు టీడీపీ అభ్యర్థి గెలుపు గురించి ఆలోచించడం లేదనీ, ఎంత మెజారిటీ సాధిస్తామనే దాని గురించే ఆలోచిస్తున్నానని తాజాగా అఖిల ప్రియ చెబుతున్నారు. ఈ ఆత్మ విశ్వాసానికి కారణం సర్వే ఫలితమే అని చెబుతున్నారు.
ఇక, వైకాపా విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా జగన్ కు సర్వేలు నిర్వహించిన పెడుతున్న ఓ ప్రముఖ సంస్థ ఈ సర్వే చేసిందనీ, శిల్పా గెలుపు ఖాయమని చెబుతూనే మెజారిటీ 15 వేల ఓట్లకు మించి ఉండదని ఆ సంస్థ తేల్చిందని అంటున్నారు. దీంతో నంద్యాల వైకాపా వర్గాల్లో కొంత ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ఎన్నికలకు ముందు ఈ మాత్రం మెజారిటీ అంటే… ఎన్నికలు జరిగే నాటికి పరిస్థితి మారే అవకాశం ఉంటుందని జగన్ చెప్పారనీ, కాబట్టి పార్టీ శ్రేణులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నంద్యాల నేతలకు సూచించారట. మొత్తానికి రెండు పార్టీలూ తమ మెజారిటీపై కాస్త అటుఇటుగా ఒకే సంఖ్య దగ్గర ఉన్నాయి. తాజా సర్వేలు రెండు పార్టీలకూ సంతృప్తికరంగా అనిపించకపోవడం విశేషం. ఇంతకీ నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఏ సర్వే నిజమౌతుందో చూడాలి మరి!