ప్రతినిధి సినిమాకి కథ అందించారు ఆనంద రవి. ఇప్పుడు దర్శకుడిగా మారి.. ‘నెపోలియన్’ సినిమాని తెరకెక్కించారు. ఆమధ్య ‘నీడ పోయింది’ అనే కాన్సెప్టుతో ఓ టీజర్‌ని విడుదల చేశారు. అది బాగా ఆకట్టుకొంది. ఇప్పుడు ట్రైలర్‌ని వదిలారు. టీజర్ ఎంత ప్రామిసింగ్‌గా అనిపించిందో.. ట్రైలర్ అంత కంటే బాగా నచ్చేట్టుంది. ‘ప్రతినిధి’లానే ఓ సగటు పౌరుడి పోరాటం అనిపిస్తోంది. హీరో తన తెలివితేటలతో ప్రభుత్వాన్ని, పోలీసుల్ని ఓ ఆటాడుకొన్నట్టే కనిపిస్తున్నాడు. దేవుడికి సంబంధించిన డైలాగులు బాగానే పేలాయి. ‘మధ్యతరగతి వాడు పోరాడాలనుకొంటాడు కానీ పోరాడలేడు.. ఎందుకంటే వాడికి సెలవొచ్చినప్పుడే కోర్టుకు కూడా సెలవు వస్తుంద’న్న డైలాగ్ హైలెట్ అని చెప్పాలి. కాస్టింగ్, మేకింగ్ పరంగా కాస్త ‘లో’గా కనిపిస్తున్నా.. కంటెంట్ విషయంలో వేలెత్తి చూపించాల్సిన అసవరం లేదనిపిస్తుంది. ఇలాంటి సినిమాలకు ఇంకాస్త పబ్లిసిటీ చేసుకొని, మంచి రిలీజ్ టైమ్ లో వదిలితే బాగుంటుంది.