ఇకపైన మొత్తం ఐరోపా దేశాలూ, ఆఫ్రికా ఖండ దేశాలు కూడా ఆరోగ్యం కోసం అమరావతికే వస్తాయట. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోస్యం. మన దగ్గర ఖర్చు తక్కువ గనక వారు వస్తారనీ, అంతేగాక భారీగా పెట్టుబడులు కూడా వచ్చిపడతాయని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ రోజు ఆయన సమక్షంలో కింగ్స్ హాస్సిటల్ అనుబంధ సంస్థలకు శంకుస్థాపన, భారత బ్రిటన్ ఆరోగ్య సహకారానికి ఆరంభం జరిగాయి. సభలో పాల్గొన్న చంద్రబాబు కాస్సేపు కింగ్స్ అంబాసిడర్‌గా మారిపోయి దానికి బ్రిటన్‌లో ఎంత పేరుందో మొత్తం యూరప్ అక్కడకు చికిత్స కోసం ఎలా వస్తుందో వివరించారు. మనం గొప్ప వ్యూహంతో ఆస్పత్రులు కట్టుకున్నామే అనుకుందాం. అన్ని దేశాల వారూ కనీసం అక్కడి భారతీయులు వరస కట్టి వచ్చేస్తారా? లేక వారి బ్రాండ్‌తో ఇక్కడ మన వాళ్లు కథ నడిపిస్తారా?అనేది సందేహమే. ఇదే గాక మరో విదేశీ కాలేజీ పనులు కూడా ప్రారంభించారు. అమృత్, ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజీ వంటి వాటి పేర్లు ప్రస్తావించి మొత్తం 13 మెడికల్ కాలేజీలు అమరావతికి వస్తున్నాయని ఇన్ని కాలేజీలు మరే రాష్ట్ర రాజధానిలోనూ లేవనిచెప్పారు. ఇన్ని కాలేజీలు ఒక్క నగరానికే ఎందుకు? వికేంద్రీకరణ జరక్కపోవడమే విభజనకు కారణమని ఒకప్పుడు వినిపించిన మాట ఏమైనట్టు? మరో విధంగా చూస్తే ఇప్పటికీ విజయవాడ ప్రాంతంలో వైద్య విస్తరణకు సూపర్ స్పెషలిస్టుల కొరత ఒక అవరోధంగానే వుందన్నది వాస్తవం.దాన్ని ఎలా సరిచేస్తారో కూడా ముఖ్యమంత్రి ఆలోచించాలి.