జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు! ఆయన మద్దతు తమకే ఉంటుందని చెప్పేసుకున్నారు! కానీ, పవన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టీడీపీని ఇరకాటంలో పడేసిందని చెప్పాలి. అదేనండీ.. నంద్యాల ఉప ఎన్నిక విషయమై తెలుగుదేశం పార్టీకి పవన్ మద్దతు ఉంటుందని మొదట్నుంచీ అందరూ అనుకున్నారు. టీడీపీ కూడా కొండంత ఆశ పెట్టుకుంది. పవన్ కు తమ కుటుంబంతో మంచి అనుబంధం ఉందనీ, ఆయన మద్దతు తమకే ఉంటుందన్న ధీమాతో మంత్రి అఖిల ప్రియ నంద్యాలలో ప్రచారం చేసుకున్నారు! కానీ, నంద్యాల ఉప ఎన్నికల విషయంలో జనసేన పార్టీది తటస్థ వైఖరి అని పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవ్వరికీ తాము మద్దతు ఇవ్వడం లేదనీ, అలా ఎవరైనా చెప్పుకుని ప్రచారం చేసుకుంటే నమ్మొద్దంటూ కూడా ప్రజలకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
జనసేన పార్టీ ఇంకా నిర్మాణ దశలోనే ఉందనీ, ఇప్పుడు తమ దృష్టి అంతా పార్టీని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేసుకోవడం పైనే ఉందని పవన్ స్పష్టం చేశారు. ఒక్క నంద్యాల ఉప ఎన్నిక మాత్రమే కాదు.. 2019లోపు జరిగే ఏ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేసే పరిస్థితి లేదనీ, అలాగే.. ఎవ్వరికీ మద్దతు ఇచ్చేది కూడా ఉండదని పవన్ సూటిగా స్పష్టం చేశారు. ఈలోగా పార్టీ నిర్మాణంపై తామంతా శ్రమిస్తామని, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నాకనే ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ చెప్పారు. వచ్చే ఎన్నికల వరకూ ఏ పార్టీకీ ఏ అభ్యర్థికీ జనసేన మద్దతు ఉండదని తెగేసి చెప్పేశారు!
పవన్ నిర్ణయంతో నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి కాస్త ఇబ్బందే అని చెప్పాలి. ఎందుకంటే, దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ మధ్యనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పవన్ భేటీ అయ్యారు. అంతేకాదు, కీలకమైన కాపుల రిజర్వేషన్లు వంటి విషయాలపై కూడా చంద్రబాబు వైఖరికి పవన్ మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో టీడీపీ – జనసేన మధ్య మరోసారి స్నేహం కుదిరిలా ఉందే అనే సంకేతాలు వ్యక్తమయ్యాయి. నిజానికి, పవన్ అవసరం ఎప్పుడైనా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆయన ప్రభుత్వాన్ని విమర్శించినా కూడా పెద్దగా స్పందించకుండా, టీడీపీ నేతల్ని సీఎం నియంత్రిస్తూ వస్తున్నారు. ఈ మధ్య పవన్ కూడా విమర్శలు తగ్గించడంతో నంద్యాల ఉప ఎన్నిక విషయంలో తమకే మద్దతు ఉంటుందన్న విశ్వాసం టీడీపీలో పెరిగింది.
మొత్తానికి, నంద్యాల విషయంలో గందరగోళానికి పవన్ కల్యాణ్ తెర దించేశారని చెప్పొచ్చు. అయితే, టీడీపీలో మరో రకరమైన గందరగోళానికి తెర లేపారని కూడా చెప్పొచ్చు! ప్రస్తుతం పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంతో మున్ముందు టీడీపీ విషయంలో పవన్ వైఖరి ఊహించినట్టుగా ఉంటుందా లేదా అనే చర్చకు తెర లేచినట్టయింది.