నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది నంద్యాల ఉప ఎన్నిక రాజకీయం. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న పట్టుదల అధికార, విపక్షాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే, ఎదుటి పార్టీని దెబ్బకొట్టే ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకునే పరిస్థితి రెండు పార్టీల్లోనూ కనిపించడం లేదు. నంద్యాల ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ తరుణంలో వైకాపాకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. వైకాపా నాయకుడు గంగుల ప్రతాప్ రెడ్డి ఆ పార్టీని వీడారు. తెలుగుదేశంలో చేరారు! ఇప్పుడు నంద్యాలలో ఇదే అంశంపై వాడీవేడీ చర్చ జరుగుతోంది. వైకాపా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డికి ఈయన సోదరుడు. ప్రతాప్ రెడ్డి గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. ఈయనకు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజక వర్గాల్లో మంచి పట్టు ఉంది. దీంతో ఆయన చేరిక తెలుగుదేశం పార్టీకి బాగా కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.
నిజానికి, గంగుల సోదరులు మొదట్లో తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. భూమా నాగిరెడ్డి కుటుంబం టీడీపీ తీర్థం పుచ్చుకున్న తరువాత.. వారు పార్టీలో ఉండలేమని భావించారు. అందుకే, ప్రత్యామ్నాయంగా వైకాపా వైపు చూశారు. ఈ పరిస్థితిని అప్పుడు జగన్ అనుకూలంగా మార్చుకున్నారు. గంగుల సోదరులను పార్టీలోకి ఆహ్వానించి టీడీపీకి ఝలక్ ఇచ్చినట్టు భావించారు. అంతేకాదు, నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయిస్తున్న తరుణంలోనే… గంగుల ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్. పార్టీలో చేరిన కొద్ది రోజులకే జగన్ మంచి గుర్తింపు ఇచ్చారని అనుకున్నారు. అయితే, గంగుల ప్రతాప్ రెడ్డి మాత్రం అప్పట్నుంచీ కాస్త అసంతృప్తిగానే ఉన్నారట. పార్టీలో చేరిన కొద్దిరోజులకే ఆయనకు వైకాపా విధానాలు నచ్చలేదనీ, ఇప్పటికిప్పుడు మళ్లీ మార్పు అంటే బాగోదనీ, అందుకే కొన్నాళ్లపాటు మౌనంగా ఉండిపోవడమే మంచిదని ప్రతాప్ రెడ్డి భావించినట్టు సమాచారం.
ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ మార్చుకుంది. కర్నూలు జిల్లా టీడీపీ నేతలతోపాటు అచ్చెన్నాయుడు వంటివారు గంగుల ప్రతాప్ రెడ్డితో చర్చలు జరిపి, ఆయన్ని టీడీపీలోకి ఆహ్వానించడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన టీడీపీలో చేరిపోయారు. ప్రతాప్ రెడ్డి పార్టీ వీడటంతో నంద్యాల ఉప ఎన్నికల్లో వైకాపాకి గట్టి ఎదురుదెబ్బే తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే, గోస్పాడు మండలం ఓట్లపై వైకాపా చాలా ఆశలు పెట్టుకుంది. ఆ మండలంలో ప్రతాప్ రెడ్డికి మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు ఆయన అనూహ్యంగా పార్టీ మారడంతో ఆ ఓట్లన్నీ టీడీపీకి పడే అవకాశం ఉంది. ఆయన టీడీపీలో చేరడంతో.. వైకాపా లెక్కలన్నీ కిందామీద అయ్యాయనీ, నేతలు తలలు పట్టుకుంటున్నారని కూడా వినిపిస్తోంది. నంద్యాల ఎన్నికకు మరోవారం సమయం ఉంది. ఈ లోగా ఇలాంటి ఝలక్కులు ఇంకెన్ని ఉంటాయో!