మెగా అభిమానుల నిరీక్షణకు తెర పడింది. చిరు 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంఛనంగా ప్రారంభమైంది. ఈనెల 22 చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పోస్టర్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమా టైటిలేంటి?? అనేది ఆ రోజే తెలియనుంది. ఈలోగా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఒకొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పేరు దాదాపుగా ఖాయమైపోయింది. విజయ్ సేతుపతి, సుదీప్‌లకు కీలక పాత్రలు దక్కాయని సమాచారం. నయనతార కథానాయికగా ఫిక్సయిపోయినట్టే. అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్త జోరుగా షికారు చేస్తోంది. మొత్తానికి టెక్నికల్‌గా, కాస్టింగ్ పరంగా చాలా స్ట్రాంగ్ టీమ్‌ని సెట్ చేసుకొంటున్నాడు చిరు. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలన్నది చిరు ఆలోచన. అందుకు తగ్గట్టే.. అడుగులు వేస్తున్నాడు. సెప్టెంబరులో షూటింగ్ మొదలు కాబోతోంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్‌ని రూపొందిస్తున్నారు.