బాలయ్య చెంపదెబ్బలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి. బాలయ్య ముక్కుమీద కోపం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చాలాసార్లు బయటపడిపోయాడు బాలయ్య. 102వ సినిమా ప్రారంభోత్సవంలో.. తన సహాయకుడిపై చేయి చేసుకొన్న ఘటన మరువక ముందే.. నంధ్యాల ఉప ఎన్నికల పర్వంలో – ఓ కార్యకర్తపై చేయి చేసుకొని కలకలం సృష్టించాడు. సోషల్ మీడియాలో ఇదో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై పూరి తనదైన శైలిలో స్పందించాడు.
” వేరే హీరోలు బయటకు వెళ్తే బౌన్సర్లు కావాలేమో. బాలయ్యకు అక్కర్లెద్దు. ఆయన ఫ్యాన్స్‌ని ఆయనే కంట్రోల్ చేసుకోగలడు. ఒకొక్కరు మీద పడుతుంటే ఆయన కొడుతుంటాడు. అలా కొడుతుంటే వాళ్లకెంత ఇష్టమో. బాలయ్య ఎవరినో కొట్టారని అంటుంటారు. వాళ్లకేం తెలుసు. బాలయ్య కొడితేవాళ్లు ఎంత ఎంజాయ్ చేస్తారో. కామన్ సెన్స్ అనే ఏరియా తేడా వస్తేనే కొడతాడు. గుర్తుపెట్టుకోండి.. ఇదో అనుబంధం మాత్రమే. ఎప్పుడైనా బాలయ్య తన అభిమానిని కొడితే.. అదో లవ్ స్టోరీ. దాన్ని సీరియస్‌గా తీసుకోకండి” అంటూ బాలయ్య చెంపదెబ్బల్ని వెనకేసుకొచ్చాడు. వేదికపై పూరి ఇలా మాట్లాడతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆఖరికి బాలయ్య కూడా. పూరి చెంపదెబ్బల స్పీచ్ నడుస్తున్నంత సేపూ… బాలయ్య కాస్త గంభీరంగానే కనిపించాడు. తాను పనిచేసిన ఓ హీరోని వెనకేసుకురావడంలో ఎలాంటి తప్పులేదు. అయితే… దాన్నో లవ్ స్టోరీగా తీర్చిదిద్దడం మాత్రం కాస్త ఓవర్ గా అనిపించింది.