నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం దాదాపు చివరి దశకు వచ్చేసింది. దీంతో ఉన్న ఈ తక్కువ సమయాన్నీ సద్వినియోగం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. నంద్యాలలోనే బస చేసిన ప్రతిపక్ష నేత జగన్ రోడ్ షోలతో బాగానే ప్రచారం చేశారు. ఇప్పుడు టీడీపీ వంతు మిగిలి ఉంది. నంద్యాల తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారం చేశారు. చివరిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాలకు రాబోతున్నారు. ఈ నెల 19న ఆయన వస్తున్నారు. అంతేకాదు, ఓ మూడు రోజులపాటు మకాం వేసి మరీ నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించబోతున్నారు. సో.. దీంతో తెలుగుదేశం ప్రచార పర్వం కూడా ముగింపు దశకు చేరినట్టే అవుతుంది. అయితే, ఈ తరుణంలో అందరి చూపూ ముఖ్యమంత్రి తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ పై పడుతోంది. చినబాబు మరోసారి ప్రచారానికి ఎందుకు రావడం లేదు..? మొదట్లో హడావుడి చేసిన మంత్రి లోకేష్, ఇప్పుడు నంద్యాల ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడం లేదు..? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత నంద్యాల వైపు ఎందుకు తొంగి చూడలేదు… ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నిజానికి, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే నంద్యాలకు లోకేష్ వచ్చారు. కొన్ని అభివృద్ధి పథకాలను శంకుస్థాపనలు కూడా చేశారు. నంద్యాలలో తెలుగుదేశం గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత, లోకేష్ బాబు ఒకసారి ప్రచారానికి వచ్చి ఉంటే బాగుంటుందనే అభిప్రాయం నంద్యాల టీడీపీ శ్రేణుల నుంచి కూడా వినిపిస్తోంది. ప్రత్యేకమైన కారణాలేవీ తెలీవుగానీ లోకేష్ మరోసారి ప్రచారానికి రాలేకపోయారు. దీనిపై ప్రతిపక్షం వైకాపా విమర్శలు చేయడం మొదలుపెడుతోంది. దీన్ని కూడా విమర్శనాస్త్రంగా మార్చుకుని.. కృత్రిమ నాయకుడు నారా లోకేష్ నంద్యాల ప్రచారంలో ఎందుకు కనిపించడం లేదో అంటూ వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
వైకాపా విమర్శల్ని కాసేపు పక్కన పెడితే.. నారా లోకేష్ ను వ్యూహాత్మకంగానే నంద్యాల ప్రచారానికి దూరం పెట్టి ఉంటారనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. ఒకవేళ నంద్యాల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేకపోతే.. దానికి చినబాబును బాధ్యుడని చేస్తూ విమర్శలొస్తాయేమోననీ, అలాంటి పరిస్థితే వస్తే వచ్చే ఎన్నికల్లో ఇంకాస్త ఇబ్బందిగా మారుతుందేమో అనే ముందస్తు అంచనాలతోనే ఆయన క్రియాశీలతను తగ్గించారనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, ఐటీ శాఖకు సంబంధించి పనుల్లో మంత్రి లోకేష్ నిమగ్నమై ఉన్నారనీ, అందుకే మరోసారి ప్రచారానికి రాలేకపోయారంటూ టీడీపీ వర్గాల వాదన వినిపిస్తోంది. కారణం ఏదైనాగానీ దీనిపై ఇలాంటి చర్చకు ఆస్కారం ఇచ్చినట్టే అయింది.