మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన దగ్గర నుంచీ తమిళనాడు రాజకీయాలు వాడీవేడిగానే ఉంటున్నాయి. అధికార పార్టీలో ప్రస్తుతం ఉన్న రెండు వర్గాలనూ ఒకటి చేసేందుకు జరగాల్సిన ప్రయత్నాలన్నీ తెర వెనక నడిపించాల్సినవారు నడిపిస్తున్నారు! ఢిల్లీ కేంద్రంగానే తమిళ రాజకీయాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్ వర్గాలు త్వరలో ఒకటి కాబోతున్నట్టు ఈ మధ్య వరుస కథనాలు వస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో చిన్నమ్మ వర్గం అప్రమత్తం కావడం విశేషం! తన బలం ఇదీ అంటూ కొంతమంది ఎమ్మెల్యేలను వెంటేసుకుని దినకరన్ ఇటీవలే ఓ ర్యాలీ నిర్వహించడం కూడా చూశాం. ఇలాంటి సమయంలో మరోసారి అమ్మ సెంటిమెంట్ ను తెర మీదికి తెచ్చారు ముఖ్యమంత్రి పళని స్వామి! అమ్మ మరణంపై న్యాయ విచారణ జరిపిస్తున్నట్టు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి, జయలలిత మరణంపై మొదట్నుంచీ చాలా అనుమానాలు వ్యక్తమౌతూ వచ్చాయి. చెన్నై అపోలో ఆసుపత్రిలో అమ్మకు నెలల తరబడి చికిత్స జరిగింది. ఇంతకీ ఆమె ఏ అనారోగ్య సమస్యతో చినిపోయారనేది స్పష్టత లేదు. ఆమె ఆసుపత్రిలో ఉన్న సమయంలో కనీసం మెడికల్ బులిటెన్లు కూడా సవ్యంగా వచ్చేవి కావు. ఆమె అనారోగ్యంతో ఉండగా అమ్మను పరామర్శించడానికి కూడా ఎవ్వరిన్నీ అనుమతించలేదు. అప్పట్నుంచే అమ్మ మరణం వెనక ఏవో కారణాలు ఉండే ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమౌతూ వచ్చాయి. కానీ, వాటిని అప్పుడు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలంటూ ప్రతిపక్షాలతోపాటు, కొంతమంది అమ్మ వర్గీయులు కూడా డిమాండ్ లేవనెత్తారు. కానీ, అమ్మ మరణించిన ఇన్నాళ్లకు న్యాయ విచారణ అంటున్నారు. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమీటీ ఏర్పాటు చేసి, అమ్మ మరణంపై నెలకొన్న సందేహాలకు వివరణ ఇవ్వాలని సీఎం ఆదేశించడం విశేషం!
అయితే, ఉన్నట్టుండి అమ్మ మరణంపై న్యాయ విచారణ టాపిక్ తెరమీదికి తీసుకుని రావడం వెనక రెండు రకాల రాజకీయ ప్రయోజనాలు కనిస్తున్నాయి. మొదటిది, దీంతో పళని, పన్నీర్ వర్గాల కలయికు మార్గం మరింత సుగమం అవుతుంది. విలీన ప్రక్రియలో విభిన్న వాదనలు వినిపించేవారి సంఖ్య తగ్గుతుంది. అమ్మ మీద తమకు అత్యంత ప్రేమ ఉందనే సెంటిమెంట్ చాటుకుంటూ… అమ్మ ఆశయ సాధన కోసమే కలుస్తున్నామని ప్రకటించుకోవచ్చు. ఇక, రెండో ప్రయోజనం… చిన్నమ్మ శశికళ, దినకరన్ వర్గాలకు చెక్ పెట్టడం! అన్నాడీఎంకే వర్గాలు విలీనం కాబోతున్న సమయంలో దినకరన్ వర్గం క్రియాశీలంగా మారడం అధికార పార్టీకి కాస్త ఇబ్బంది కలిగించే వ్యవహారంగా మారుతోంది. ఆ పరిస్థితి మరింత ముదరక మునుపే ఆ వర్గంపై అనుమానాలు రేకెత్తించడం ద్వారా.. మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల్లో అభద్రతా భావాన్ని కలిగించొచ్చు కదా! ఈ విధంగా తమిళనాడుతో మరోసారి అమ్మ సెంటిమెంట్ ప్రయోగిస్తున్నట్టు చెప్పొచ్చు.