దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయీకరణ చేయాలన్న కృత నిశ్చయంతో భారతీయ జనతా పార్టీ ఉంది. సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి ఒక్కో రాష్ట్రంలో తమ పార్టీయే అధికారంలోకి ఉండేలా చూసుకుంటోంది. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాలపై కూడా భాజపా దృష్టి ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లోపు తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న సంకల్పంతో అధ్యక్షుడు అమిత్ షా ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రానికి ఓ రెండుమూడు దఫాలు వచ్చి వెళ్లారు. ఇప్పుడు ఢిల్లీలో ఉంటూ తెలంగాణ భాజపా శ్రేణులకు వ్యూహాలను రచిస్తున్నారు. తాజా వ్యూహం ఏంటంటే… తెలంగాణ భాజపాలో కొత్త నేతల్ని చేర్చుకోవాలనేది! పార్టీలోకి రావాలనుకుంటున్నవారికి ఆహ్వానాలు పంపండి అంటూ అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారనీ, అమిత్ షా సూచనల మేరకు ఓ జాబితాను సిద్ధం చేసినట్టు కూడా చెప్పుకుంటున్నారు.
భాజపా ప్రధాన లక్ష్యం తెరాసపైనే ఉందని అంటున్నారు. తెరాసలో కొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పదవులు ఆశించి ఇతర పార్టీల నుంచి జంప్ జిలానీలుగా చేరిన వారిని భాజపా టార్గెట్ చేసుకోబోతున్నట్టు సమచారం. కాంగ్రెస్, టీడీపీల నుంచి తెరాసకు పెద్ద ఎత్తున నాయకులు వలసలు వెళ్లిన సంగతి తెలిసిందే. వారిలో డీయస్, కెకె, ఎర్రబెల్లి దయాకరరావు వంటి వారు కొంత అసంతృప్తితో ఉన్నట్టు ఈ మధ్య జోరుగా వినిపిస్తోంది. ఇలాంటి వారిని భాజపాలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని ఢిల్లీ నుంచి కూడా సంకేతాలు వచ్చాయట. ఇప్పటికే డీఎస్ విషయమై కొంత చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ మార్పుపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంకోపక్క.. డీఎస్ కుమారుడు భాజపాకి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉంటున్నారు. కేసీఆర్ తో ఎప్పట్నుంచో కొనసాగుతున్న కేకే కి కూడా తెరాసలో ప్రాధాన్యత సరిపోవడం లేదన్న అసంతృప్తి ఉందట. ఇక, ఎర్రబెల్లి కూడా ముభావంగా ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు. తెరాసలో ఇలాంటి నేతల్ని గుర్తించి… పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడంపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
జిల్లా స్థాయి నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీటీలను కూడా చేర్చుకునేందుకు తెలంగాణ భాజపా సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. అయితే, పార్టీలోకి ఆహ్వానించాలనుకుంటున్న నేతల బలాబలాలను అంచనా వేసే పనిలో ఓ కమిటీ ఉందని సమాచారం. ఆ కమిటీ నివేదిక ఆధారం జిల్లా, మండల స్థాయి నేతల్ని చేర్చుకుంటారట. ఇక, బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేసుకునే ప్రక్రియ ఇప్పటికే జరుగుతోంది. మొత్తానికి, తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు భాజపా సిద్ధమౌతోందని చెప్పొచ్చు. అధికార పార్టీ నుంచి కొంతమందినైనా ఆకర్షించగలిగితే అది కచ్చితంగా సంచలనమే అవుతుంది. ఓ పక్క భాజపా స్నేహం కోసం కేసీఆర్ చూస్తుంటే… తెరాస విషయంలో భాజపా ఇలాంటి వ్యూహంతో ఉంది! ఆ తరువాత, సీఎం కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందో మరి!