రాజకీయాల్లో ముందుచూపు చాలా అవసరం. అందులో ఎలాంటి సందేహం లేదు! ఆ విషయంలో తెలుగుదేశం పార్టీకి మరింత ముందుచూపు ఉందనే చెప్పుకుంటారు! నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తోందో చూస్తున్నాం. ఎన్నికలకు సరిగ్గా వారం ముందు గంగుల ప్రతాప్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని, వైకాపాకి ఝలక్ ఇచ్చారు. అయితే, ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడం వెనక రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది.. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు. గంగుల ప్రతాప్ రెడ్డి చేరికతో నంద్యాల నియోజక వర్గంలో బలమైన వైకాపా వర్గం టీడీపీవైపు తిరిగింది. తాత్కాలికంగా నంద్యాల ఉప ఎన్నికలో ఇది టీడీపీకి కలిసొచ్చే అంశం. ఇక, రెండోది.. దీర్ఘకాలిక వ్యూహం! 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గంగుల ప్రతాప్ రెడ్డిని టీడీపీలోకి తీసుకున్నట్టు చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఆయనకి టీడీపీ నుంచి నంద్యాల అసెంబ్లీ సీటు, లేదా నంద్యాల ఎంపీ టిక్కెట్ ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇప్పట్నుంచే వినిపిస్తోంది. ఆ ఒప్పందంతోనే గంగులను చేర్చుకున్నట్టూ చెబుతున్నారు.
అయితే, ఈ క్రమంలో మంత్రి భూమా అఖిల ప్రియ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడేట్టు స్పష్టంగా కనిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో సోదరుడు బ్రహ్మానంద రెడ్డిని గెలిపించుకోకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఇప్పటికే అఖిల ప్రియ శపథం చేశారు. చిన్న వయసులోనే తండ్రి మరణం, అనూహ్యంగా నెత్తిన పడిన రాజకీయ బాధ్యతలు, ఇప్పుడీ నంద్యాల ఉప ఎన్నికలు… ఓరకంగా ఇదంతా ఆమెకి తలకు మించిన భారమే. ఈ నేపథ్యంలో శక్తివంచన లేకుండా పార్టీ నుంచి కూడా ఆమెకు సాయం అందుతోంది. నిజానికి, భూమా కుటుంబం ఆళ్లగడ్డ, నంద్యాల నియోజక వర్గాల్లో మాంచి పట్టు ఉండేది. భూమా నాగిరెడ్డి మరణం తరువాత ఆ బాధ్యతల్ని అఖిల ప్రియ నెత్తిన వేసుకున్నారు. తాత్కాలికంగా ఈ ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికి నంద్యాల టిక్కెట్ ఇచ్చినా, 2019 ఎన్నికలకు వచ్చే సరికి భూమా కుటుంబాన్ని సొంత నియోజక వర్గం ఆళ్లగడ్డకు మాత్రమే పరిమితం చేయబోతున్నట్టుగా ఉంది.
నిజానికి, ఆళ్లగడ్డలో భూమా, గంగుల కుటుంబాలు మొదట్నుంచీ వైరి వర్గాలుగానే ఉంటూ వస్తున్నాయి. భూమా టీడీపీలో ఉన్నప్పుడు… గంగుల కుటుంబం కాంగ్రెస్ నుంచీ పోటీకి దిగింది. భూమా నాగిరెడ్డి వైకాపా నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకునేసరికి.. గంగుల కుటుంబం వైకాపాలో చేరింది. ఇప్పుడు, ప్రతాప్ రెడ్డి అనూహ్యంగా టీడీపీలోకి వచ్చారు. మరోసారి ఈ రెండు కుటుంబాలూ ఒకే చోట తలపడే కంటే… ఒకే పార్టీ నుంచి రెండు నియోజక వర్గాల్లో పోటీకి దిగితే టీడీపీకి ఉపయుక్తంగా ఉంటుందనేది చంద్రబాబు వ్యూహంగా చెప్పుకోవచ్చు. ఆళ్లగడ్డ, నంద్యాలపై పట్టు సాధించుకోవాలంటే… ఈ ఎన్నికల్లో అఖిల ప్రియ సోదరుడిని గెలిపించుకున్న మాత్రాన చాలదు. వచ్చే రెండేళ్లలో ఆమె మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఏదేమైనా, అఖిల ప్రియకు ఇది పరీక్షా కాలం అనడంలో సందేహం లేదు.