ఎపిలో కులతత్వాలు ఎక్కువని తెలంగాణలో ఆ ప్రభావం వుండదని ముఖ్యమంత్రి కెసిఆర్ కొంతకాలం కిందట వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్రంలో మూడు పై స్థాయి సామాజిక వర్గాల మధ్య అలాటి రచ్చ రాజకీయ రూపం తీసుకోవడం విశేషం. సమగ్ర సర్వే ప్రకారం తెలంగాణలో బిసిలు, ఎస్సిఎస్టిలు, మైనారిటీలు 92 శాతం పైగా వున్నారట. మిగిలిన ఏడు శాతంలోనే అగ్రవర్ణాలుగా చెప్పబడేవి వున్నాయి. ఇందులో వెలమలు 0.5 శాతం కాగా ఈ ప్రభుత్వంలో లక్ష కోట్ల బడ్జెట్టు నడిపిస్తున్నారని పిసిసి అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అప్పటికే రెడ్డి వర్సెస్ వెలమ తరహాలో నడుస్తున్న చర్చలో రేవంత్ రెడ్డి లాటి వారు తమ పార్టీ టిడిపి పరిధి దాటి కుల తరహాలో మాట్టాడి వున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే మాట్లాడ్డంతో టిఆర్ఎస్నాయకుడు ప్రకాశ్ వారిని ఎదుర్కొవడానికి కొత్త ట్విస్టు తీసుకొచ్చారు. రెడ్లు 2 శాతం వుంటే కమ్మలు 2.5శాతం వున్నారని ఆ విధంగా చూస్తే సంఖ్యా పరంగా వారే ఎక్కువని ఆయన వివరించారు. అయితే తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజా కంటకులైన దొరలలో అత్యధికులు రెడ్లు కాగావారిపై పోరాడిన వారిలోనూ రెడ్లు వున్నారని సర్దుబాటు చేశారు. కరీం నగర్ వంటి చోట్ల మాత్రం వెలమ దొరలున్నారని ఆయన తెలిపారు. ఇదంతా విన్న కాంగ్రెస్ నేతలు ఈ లెక్కల ద్వారా టిఆర్ఎస్ తెలంగాణలో కొత్త సామాజిక సమీకరణలు తెచ్చి తమను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఇదంతా వైరల్అయిపోయింది. ఈ కథకు హైలెట్ ఏమంటే జెఎసి చైర్మన్ కూడా కోదండరాం కూడా ఈ కోణంలోనే కాంగ్రెస్తో కలసి తమను ఓడించడానికి వ్యూహాలు పన్నుతున్నారని ప్రకాశ్ ఆరోపించడం. సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం సామాజిక న్యాయ యాత్ర రాష్ట్రమంతా జరిగితే కోదండరాం ముఖ్యమంత్రికుటుంబ సభ్యుల నియోజవర్గాలకే వచ్చి వివాదం పెంచుతున్నారని కూడా పాలకపక్షం అంటున్నది. ఏతావాతా కెసిఆర్ లేవన్న కుల వివాదాలు పురివిప్పుతున్నాయి.కోదండరాం పై కుల బాణం తీయడం సరైందేనా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమైంది.