తెలంగాణలో పార్టీ విస్తరణ, పటిష్టత కోసం భాజపా గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర పార్టీల నేతల్ని ఆహ్వానించేందుకు సిద్ధమౌతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్త నేతల్ని తమవైపు తిప్పుకోవాలంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించారనే కథనాలు ఈ మధ్య వచ్చాయి. జిల్లా, మండల స్థాయి నేతల్ని కూడా పెద్ద ఎత్తున చేర్చుకునేందుకు రంగం సిద్ధమౌతోందని సమాచారం. తెలంగాణలో భాజపాలో కనిపిస్తున్న హడావుడి ఇది! ఇక, కాంగ్రెస్ విషయానికొస్తే.. ఎప్పటిలానే ఆధిపత్య పోరు కనిపిస్తూనే ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా కుంతియాకు బాధ్యతలు అప్పగించడం కొంతమందికి నచ్చలేదు. సీనియర్లలో ఈ అసంతృప్తి ఉన్నా… కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాత్రమే బయటపడిన సంగతి చూశాం. అయితే, ఆయన కుంతియాపై బహిరంగంగా అసంతృప్తి గళం వ్యక్తం చేయడం వెనక కారణం వేరే ఉందనే చర్చ తెర మీదికి వచ్చింది!
కోమటిరెడ్డి సోదరులు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటూ మరోసారి చర్చ మొదలైంది. నిజానికి, కొన్నాళ్ల కిందటే ఇదే టాపిక్ తెరమీదికి వచ్చింది. కోమటిరెడ్డి తెరాసలో చేరతారంటూ బాగానే ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల్ని కోమటిరెడ్డి ఖండించారు. ఇప్పుడు భాజపాలో చేరతారంటూ మొదలైన చర్చపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే, నాటి పరిస్థితికీ ఇప్పటి వాతావరణానికీ కాస్త తేడా ఉందని కొంతమంది అంటున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి తమ సోదరులకు వస్తుందని కోమటిరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. తమకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే, రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో పాదయాత్ర చేసి మరీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తామని కూడా బహిరంగంగానే గతంలో చెప్పారు. ఇదే లక్ష్యంతో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అధిష్ఠానికి ఫిర్యాదులు కూడా బాగానే చేసినట్టు కూడా కనిపించింది!
అధిష్ఠానం కూడా మార్పులు ఉంటాయనే సంకేతాలు ఇస్తూ వచ్చింది. దీంతో కోమటిరెడ్డి ఆశలు నిన్నమొన్నటి వరకూ సజీవంగానే ఉండేవి. కానీ, కుంతియా రాష్ట్రానికి రావడంతో సీన్ మారిపోయింది. పీసీసీలో ఎలాంటి మార్పూ ఉండదనీ, ఉత్తమ్ నాయకత్వంలోనే పార్టీ నడవాల్సి ఉంటుందని అధిష్ఠానం మాటగా ఆయన చెప్పేసి వెళ్లిపోయారు. దీంతో కోమటిరెడ్డి సోదరుల్లో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరిందని చెబుతున్నారు. ఇదే సందర్భంలో పార్టీలో నేతల్ని చేర్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్న భాజపా… ఈ సోదరులకు టచ్ లోకి వెళ్లినట్టు కథనం. కుంతియాపై అంత తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేయడం వెనక ఉన్న ధైర్యం ఇదేనేమో అనే చర్చ జరుగుతోంది. సోదరులు భాజపాతో మంథనాలు సాగిస్తున్నారంటూ కాంగ్రెస్ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి, ఈ కథనాలపై కోమటిరెడ్డి స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.