మాట్లాడితే వైసీపీ నేత జగన్‌పై విరుచుకుపడే ఒక మంత్రి సన్నిహితులతో మాత్రం భిన్నంగా మాట్లాడారట. వయస్సులో తక్కువైనా ముఖ్యమంత్రికి భలే చమటలు పట్టిస్తున్నాడని ఆయన మెచ్చుకోవడం వెనక సామాజికానుబంధాలే ముఖ్య పాత్ర వహించాయని మీడియా మిత్రుల వ్యాఖ్య.జగన్‌తోనే ఆగక రోజాను కూడా మెచ్చేసుకున్నారట. పురుషపుంగవులు కూడా సిగ్గుతో తలదించుకునేట్టు రోజా సవాళ్లు విసురుతుంటే తాము ఏం చెప్పినా నిలవడం లేదని ఆయన కితాబిచ్చారట.వాస్తవానికి ఈ దూకుడు మాటల వల్ల నష్టం తప్ప లాభం లేదని చాలామంది వైసీపీ నేతలు, పరిశీలకులు కూడా చెబుతుంటే ఈ మంత్రికి మాత్రం భలే నచ్చడం వింతగానే వుంది. మంత్రుల్లో అచ్చెంనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఇతర నేతల్లో వర్లరామయ్య తప్ప వైసీపీకి ధీటుగా జవాబిచ్చేవారికే కొరత ఏర్పడిందని టిడిపి నేతలు వాపోవవడం విశేషం.
జగన్ ఇదివరకు మాట్లాడిన వాటిపై తీవ్ర విమర్శలు వచ్చినా మార్చుకోకపోగా మరింత గా దాడి చేస్తున్నారు.దీనికి ఆయన అనుయాయుల వివరణ కూడా వినదగ్గదే. ఆయన అలా మాట్లాడారు కనుకనే టిడిపి అనుకూల మీడియాలో ఈ మాత్రం ప్రచారం నెగిటివ్‌గానైనా వస్తున్నది. అదే బుద్ధిమంతుడులా సుద్దపప్పుల్లా ఏదో చెప్పుకుంటూ పోతే ఎవరు పట్టించుకుంటారని వారు ఫ్రశ్న వేస్తున్నారు. రోజా వంటి వారు కూడా అందుకే ఉధృతదాడి కొనసాగిస్తున్నారనేది వారి విశ్లేషణ.