నంద్యాల ఉప ఎన్నికను అధికార ప్రతిపక్ష పార్టీలు ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నియోజక వర్గంలో అభివృద్ధి పేరుతో కోట్లకు కోట్లు నిధులను టీడీపీ సర్కారు గుమ్మరించింది. హుటాహుటిన శంకుస్థాపనలు చేసేసింది. ఇక, వైకాపా కూడా అంతే..! నంద్యాలలో దాదాపు పదిరోజులపాటు ప్రతిపక్ష నేత జగన్ తిష్ఠ వేశారు. దీన్ని ఒక సాధారణ ఉప ఎన్నికగా రెండు పార్టీలూ భావించడం లేదు. చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనపై ప్రజలు ఇవ్వబోతున్న తీర్పునకు నంద్యాలే నాంది అంటూ జగన్ చెబుతూ వస్తున్నారు. రాష్ట్రంలో అధికారం మార్పు ఇక్కడి నుంచే మారుతుందని సవాల్ చేస్తూ వచ్చారు. టీడీపీ ప్రచారం ఎలా ఉందంటే… చంద్రబాబు నాయుడు సర్కారు చేసిన అభివృద్ధిని ప్రజలు మరోసారి గుర్తించడం ఇక్కడి నుంచే మొదలు అనీ! అయితే, ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాల ఎన్నికల ఫలితాల గురించి కేంద్రమంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
నంద్యాల ఉప ఎన్నికను చిన్నగానే చూడాలనీ, దీన్ని టీడీపీ పాలనకు రెఫరెండమ్ గా చూడకూడదని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పడం విశేషం. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో కూడా చాలా ఉప ఎన్నికలు వచ్చాయనీ, వాటిలో కొన్ని గెలిచామనీ, మరికొన్ని ఓడామని ఆయన చెప్పారు. నంద్యాలలో టీడీపీ నేతలు డబ్బు పంచుతున్నారంటూ వైకాపా చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆ వ్యవహారం ఎన్నికల సంఘం చూసుకుంటుందన్నారు. దొంగే దొంగా దొంగా అని అరచినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. నంద్యాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పుడే ఎందుకు చేపట్టినట్టు అనే ప్రశ్నకు సుజనా స్పందిస్తూ… రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, నగరాలూ పట్టణాల అభివృద్ధిపై టీడీపీ దృష్టి పెట్టిందనీ, దాన్లో భాగంగానే నంద్యాలలో కూడా కార్యక్రమాలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక చిన్నదైనా పెద్దదైనా ఒక రాజకీయ పార్టీగా టీడీపీ నుంచి గట్టి పోటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నారు.
మొత్తానికి, నంద్యాల ఉప ఎన్నిక రెఫరెండమ్ కాదని ఈ దశలో సుజనా చెప్పడం విశేషమే. ఎందుకంటే, ఈ ఎన్నిక విషయంలో మొదట్నుంచీ వైకాపా చెబుతున్నది ఇదే కదా! చంద్రబాబు నాయుడి మూడున్నరేళ్ల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటెయ్యాలని ప్రచారం చేస్తున్నారు. స్థానిక అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా, రాష్ట్రస్థాయిలో టీడీపీ చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలని చెబుతున్నారు. ఒకవేళ నంద్యాల ఉప ఎన్నిక రెఫరెండమ్ కాదని టీడీపీ భావిస్తే ఆ మాట ముందే చెప్పి ఉండాల్సింది. జగన్ ఇలా ప్రచారం మొదలుపెట్టినప్పుడే ఖండించి ఉండాల్సింది. ఒకవేళ ఈ ఎన్నిక చిన్నదే అని భావిస్తే… అంతమంది మంత్రులనూ, ఇతర ప్రాంతాల నేతలనూ నంద్యాలలో మోహరించాల్సిన అవసరం ఏముంది..? ఇక, ఉప ఎన్నిక నేపథ్యంలోనే నంద్యాలలో ఇబ్బడిముబ్బడిగా అభవృద్ధి పనులు జరుగుతున్నాయన్నది వాస్తవం. ఒకవేళ ఎన్నికలు లేకపోయి ఉంటే… ఈ స్థాయిలో నంద్యాల సమస్యలపై శ్రద్ధ పెట్టేవారా..? ఇదే శ్రద్ధను ఇతర ప్రాంతాలూ సమస్యలపై ఎందుకు ప్రదర్శించడం లేదనే ప్రశ్న కూడా ఉంటుంది కదా! ఏదేమైనా, ఎన్నికకు కొద్ది రోజుల ముందు సుజనా చౌదరి ఇలా వ్యాఖ్యానించడం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంటుందని చెప్పొచ్చు. ఈ కామెంట్ ను వైకాపా తనకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేసుకునే అవకాశం ఉంది.