రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఒత్తిళ్లు తెచ్చి తన మార్గంలోకి తిప్పుకోవడంలో ప్రధాని మోడీ- బిజెపి అద్యక్షుడు అమిత్షా ద్వయం సఫలీకృతమవుతున్నది. సిబిఐని ఐటిని క్రమపద్దతిలో ప్రయోగించడం ఇందుకు ఆయుధమవుతున్నది. బీహార్లో ఆర్జేడీ నేత లాలూ కుటుంబంపై దాడులు చేసి ముఖ్యమంత్రి నితిష్ను తమవైపునకు తెచ్చుకోగలిగింది. తమిళనాడులో అన్నా డింకె వర్గాలను ఒకటి చేసి తన ఖాతాలో వేసుకుంటున్నది. ఎపిలో వైసీపీ నేత జగన్ తరపున ఎంపి విజయసాయి రెడ్డి నిరంతరం సంబంధాలు పాటిస్తున్నారు. బిజెపిపై విమర్శలో ముందుండే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా ఈ జాబితాలో చేరిపోతున్నారనిపిస్తుంది. తనకు ప్రధాని మోడీ నచ్చుతారు గాని అమిత్ షా నచ్చరని ఆమె వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. షా నియంతలా వ్యవహరిస్తున్నారని అంటూ ప్రధాని ఆయనా లేక మోడీనా అని ప్రశ్నించారామె.సిబిఐ వంటి సంస్థలను ప్రయోగించి ప్రతిపక్షాలను దెబ్బతీస్తున్నారని కూడా ఆరోపించారు. మరి ఈ దాడులు షా చేయిస్తున్నారని ఆమె ఉద్దేశమా? ఏది ఏమైనా మోడీకి కాస్త సానుకూల సంకేతాలు పంపడానికే మమత ఇలా మాట్లాడారని పరిశీలకుల అంచనా. కొద్ది మాసాల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడిన దానికి దగ్గరగా వున్నాయి. అప్పట్లో పర్యటనకు వచ్చిన అమిత్ షా విమర్శలపై కెసిఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాని మరోవైపున మోడీని మాత్రం కొనియాడారు. చర్చలలో ఇది తరచూ ప్రస్తావనకు వచ్చేది. ఇప్పుడు మమత కూడా అదే మంత్రం పాటించడం విశేషం. అయితే ఆరుమాసాలలో ప్రతిపక్షాల ఐక్యత ఒక కొలిక్కి వస్తుందని కూడా ఆమె అన్నారు.