రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి వైసీపీ అద్యక్షుడు జగన్ ప్రధాని మోడీని కలవడానికి పెద్ద రాజకీయ ప్రాధాన్యత లేదని ఉభయ పార్టీలూ వాదిస్తూ వస్తున్నాయి. అయితే అదే సమయంలో భవిష్యత్తుకు సంబంధించి ఏం చేస్తామనేది చెప్పడానికి బిజెపి సిద్దపడటం లేదు. టిడిపి వైసీపీ రెంటికీ తలుపులు తీసి వుంచాలనేది బిజెపి వ్యూహంగా వుంది. ఇటీవలనే వచ్చే ఎన్నికల వ్యూహంపై జరిగిన జాతీయ సమావేశంలోనూ ఎపి విషయం అనిశ్చితంగా వదలివేసినట్టు ఈనాడు ప్రత్యేకంగా వార్త నిచ్చింది. అప్పటి పరిస్థితిని బట్టి వైసీపీ టీడీపీల మధ్య తేల్చుకోవచ్చని బిజెపి అధిష్టానం భావిస్తున్నదట. ఈనాడులో ఇటీవల వైసీపీ వార్తల ప్రచురణ ప్రాధాన్యత పెరిగిన సంగతి అందరూ గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి వ్యూహంపై కూడా వచ్చిన కథనానికి ప్రాధాన్యత చాలా వుంటుంది. ఇరుపార్టీల మధ్యన దాగుడుమూతలాడుతూ ప్రయోజనం పొందాలనే బిజెపి ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.నిజానికి అక్కడ బిజెపి వంటరిగా చేయగలిగింది లేదని కూడా బలమైన అంచనా వుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలసి వుంటామనే చెబుతున్నా నిర్ణయం బిజెపిపై ఆధారపడి వుంటుంది. నంద్యాల ఉప ఎన్నికలలో మద్దతు ప్రకటించినా మైనార్టిల వ్యతిరేకత భయంతో టిడిపి తమను దూరం పెట్టడంపై బిజెపి నేతలు సరైన సమాధానం కూడాచెప్పలేకపోతున్నారు.తెలంగాణలో మాత్రం టిఆర్ఎస్ను గట్టిగా వ్యతిరేకిస్తేనే పెరుగుతామని కూడా బిజెపి నేతలు నిర్దారణకు వచ్చారట. వెంకయ్య నాయుడు రంగంలో లేకపోవడం వల్ల కూడా వెసులుబాటు పెరిగిందంటున్నారు. ఆ స్థానంలో రాం మాధవ్ కేంద్ర పదవిలోకి వస్తారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలనాటికి బండారు దత్తాత్రేయ వయస్పు పెరుగుతుంది గనక ఆయన తప్పుకోవలసిందేనని ఒకరు అన్నారు. అధికారంలోకి వస్తామని గొప్పగా చెబుతున్నా కనీసం 15 స్థానాలు తెచ్చుకోవాలస్నది బిజెపి వ్యూహంగా వుంది. ఆ స్థానాలను గుర్తించారు కూడా.