నంద్యాల ఉప ఎన్నిక ప్రధానంగా తెలుగుదేశం, వైయస్సార్ సీపీల మధ్యనే జరుగుతోంది. మూడో పార్టీకి అవకాశం లేదనేది తెలుస్తూనే ఉంది. అయితే, ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి దిగిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ తరఫున పీసీసీ అధ్యక్షుడు రఘువీరాతో మరికొంతమంది నేతలు నంద్యాలలో ప్రచారం చేశారు. నామ్ కే వాస్తే అన్నట్టుగా జెండా మోశారు. కాంగ్రెస్ పార్టీకి అనూహ్య స్పందన లభిస్తోందనీ, అధికార ప్రతిపక్షాల తీరుతో విసిగిపోయిన నంద్యాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారనీ, అందుకే కాంగ్రెస్ కు అవకాశం ఉందనేది ఆ పార్టీ నాయకులు మీడియా ముందు చెప్తున్నారు. నిజానికి, ఇక్కడ కాంగ్రెస్ కు అంత సీను లేదనే విషయం చిన్నపిల్లాడికైనా అర్థమైపోతుంది. మరి, అలాంటప్పుడు కాంగ్రెస్ ఎందుకు పోటీలో దిగినట్టు..? అంటే, పోటీ చేయకూడదనే రూలేం లేదు. ఎంతమంది అభ్యర్థులైనా పోటీకి దిగొచ్చు. కానీ, ఇప్పుడీ ప్రశ్న ఎందుకు వినిపిస్తోందంటే… నంద్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి పోటీకి దిగడం వెనక వేరే రాజకీయం ఉందనే చర్చ వినిపిస్తోంది.
రాష్ట్ర విభజన దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఉనికి లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొంది. ఆ ఎన్నికల్లో వైకాపా ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరుకుంది. అయితే, వైకాపాకు సంస్థాగతంగా అప్పటికి ఓటు బ్యాంకు అంటూ ఏమీ లేదు. కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతే వైకాపాకి బలమైంది. ఆ పార్టీ ఓటు బ్యాంకే వైకాపాకి వెళ్లింది. నంద్యాల విషయం మాట్లాడుకుంటే… గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి దాదాపు 2400 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల సమయానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక గాలి వీస్తోంది కాబట్టి, ఏపీ విభజన వేడి కాకమీద ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థికి ఆ మాత్రం ఓట్లు రావడం కూడా విశేషమనే చెప్పాలి. ప్రస్తుతం లెక్కలు తీసుకుంటే… నంద్యాలలో కనీసం ఓ మూడు నుంచి నాలుగు వేల ఓట్లు కాంగ్రెస్ కు పడే అవకాశం ఉంది. ఆ మాత్రం దానికి కాంగ్రెస్ బరిలోకి దిగాల్సిన అవసరం లేదనే చెప్పాలి! కానీ, ఇక్కడే అసలు మతలబు ఉంది.
ఒకవేళ నంద్యాల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి నిలబడకపోయి ఉంటే… ఈ మూడే నాలుగువేల ఓట్లన్నీ ఎటు పడతాయి..? కచ్చితంగా వైకాపాకే అనడంలో సందేహం లేదు. సో… అదీ లెక్క అన్నమాట. అందుకే, హస్తం పార్టీ అభ్యర్థిని పెడితే వైకాపా ఓట్లకు ఆ మేర గండి కొట్టే అవకాశం ఉంటున్న వ్యూహంతో కాంగ్రెస్ అభ్యర్థిని కొంతమంది పెద్దలు పెట్టినట్టు చర్చ జరుగుతోంది. ఓ సీనియర్ మంత్రితోపాటు… మరో ఐ.ఎ.ఎస్. అధికారి కూడా ఈ వ్యూహాన్ని అమలు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నంద్యాలలో మైనారిటీ ఓటర్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. కాబట్టే, ఖాదర్ ను బరిలోకి దించారనీ అంటున్నారు. అభ్యర్థిని ప్రకటించేసి గమ్మున కూర్చుంటే బాగోదనీ, ఏదో తప్పదన్నట్టుగా ప్రచార పర్వాన్ని ముగించేశారు. నంద్యాల పోటీపై కాంగ్రెస్ కే శ్రద్ధ లేదని చెప్పేందుకు ఓ బలమైన పాయింట్ కూడా ఉందండోయ్! అదేంటంటే… కాంగ్రెస్ అభ్యర్థి తరఫున బూతుల్లో ఏజెంట్లను కూడా ఏర్పాటు చేయడం లేదట!