ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఎ.బి.వి.పి. విజయం సాధించింది. అధ్యక్ష పదవి సహా మొత్తం 4 పదవులనూ ఆ సంస్థ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినట్టే, యూనివర్సిటీలోనూ తమ వాళ్లను గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నించారు. చివరకు ఓ స్టేడియంలో రాక్ షోతో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఆప్ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయనొక్కడే కాదు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రచారంలో పాల్గొన్నారు. కొన్ని పార్టీలు, విద్యార్థి సంస్థలు డబ్బు ఎరవేసి ఓట్లు కొనాలని చూస్తున్నాయని కూడా ప్రత్యర్థులపై ఆరోపణలు చేశారు. యూనివర్సిటీ క్యాంపస్ లో వై ఫై సౌకర్యం కల్పిస్తానని హామీ కూడా ఇచ్చారు.
అయినా విద్యార్థులు మాత్రం కేజ్రీవాల్ మాటలు పట్టించుకోలేదు. ఈసారి ఏబీవీపీని గెలిపించాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీజేపీకి, డి.యు.లో ఏబీవీపీ గెలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. నగరంలోని యువతలో, ముఖ్యంగా విద్యార్థుల్లో తమ బలం చెక్కు చెదరలేదని బీజేపీ నాయకులు ఖుషీ అవుతున్నారు. ఎన్ ఎస్ యు ఐ సహా ఇతర విద్యార్థి సంఘాలు ఎంత కష్టపడ్డా పరాజయం తప్పలేదు. ముఖ్యమంత్రి హోదాలోల విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రచారం చేసిన కేజ్రీవాల్ కు ఇది పెద్ద జలక్ అని ఏబీవీపీ, బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.