దాదాపు నెలరోజులుగా గృహ నిర్బంధంలోనే ఉంటున్నారు ముద్రగడ పద్మనాభం! కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఛలో అమరావతి పాదయాత్రను గత నెలలో ఆయన తెలపెట్టారు. అప్పట్నుంచీ కిర్లంపూడిలో పోలీసు పహారా కొనసాగుతోంది. ప్రతీరోజూ ఉదయాన్నే పాదయాత్రకు ముద్రగడ బయలు దేరడం, యథావిధిగా పోలీసులు అడ్డుకోవడం అనేది దినచర్యగా మారిపోయింది. అడుగు కదిలే పరిస్థితి లేకపోయినా ముద్రగడ మాత్రం ఇంకా పాదయాత్ర చేస్తాననే అంటూ వస్తున్నారు. ఈ పట్టుదలతో ఉపయోగం లేదని తెలిసినా కూడా ఇన్నాళ్లూ కాలయాపన చేశారు. అయితే, ఇప్పుడు వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యమాన్ని కిర్లంపూడి నుంచి కాకుండా.. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల నుంచీ మొదలయ్యేలా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కిర్లంపూడికి పెద్ద ఎత్తున అభిమానులు ఆదివారం తరలి వచ్చారు. ఈ తరుణంలో మరోసారి ముద్రగడకు యాత్రకు ప్రయత్నించారు, పోలీసులు అడ్డుకున్నారు. కాపులకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నాయుడు నెరవేర్చకపోవడం వల్లనే రోడ్కెక్కాల్సి వస్తోందని మరోసారి ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల హద్దులు దాటుకుని యాత్ర చేసి తీరతా అని మరోసారి చెప్పారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొత్తానికి, ముద్రగడ గృహ నిర్బంధం మరికొన్నాళ్లపాటు కొనసాగే పరిస్థితే కనిపిస్తోంది. దీంతో ఓ కాపుల ఉద్యమాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపించాలని ముద్రగడ ఆలోచనలో ఉన్నారు. ఈ వ్యూహాన్ని కాపు జాయింట్ యాక్షన్ కమిటీ అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇకపై రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల స్థాయిల్లో నిరసలు చేపట్టాలనీ, రాస్తారోకోలు చేయాలనీ, ప్రెస్ మీట్లు పెట్టి రిజర్వేషన్ల డిమాండ్ ను ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు, ఇకపై రాష్ట్రంలోని నలుమూలల నుంచి కాపుల మహిళ, యువత, నాయకులు కిర్లంపూడికి పెద్ద సంఖ్యలో వెళ్లాలని కూడా డిసైడ్ అయ్యారట. దీని కోసం ప్రాంతాల వారీగా వ్యూహాలను ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచే ఈ ప్రత్యేక కార్యాచరణ అమలు మొదలౌతుందని అంటున్నారు. ప్రతీ రోజూ నియోజక వర్గ స్థాయిలో నిరసనలు చేపట్టి.. అవి పూర్తయిన వెంటనే ఆయా నేతలూ మద్దతుదారులు కిర్లంపూడి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారట. కిర్లంపూడి నుంచి ముద్రగడ కదల్లేని పరిస్థితి ఉంది కాబట్టి, ఆయనకు మద్దతుగా నిలిచేందుకు కాపులనే కిర్లంపూడికి తీసుకుని రావాలని ఆలోచిస్తున్నారట.
ముద్రగడ వ్యూహం వినడానికి బాగానే ఉందికానీ, దీన్ని పక్కాగా అమలు చేయడం ఎంతవరకూ సాధ్యం అనేదే అసలు ప్రశ్న? ఎందుకంటే, ఇప్పటికే కిర్లంపూడి చుట్టూ పోలీసులు ఉన్నారు. ఇలా జిల్లాల నుంచి తరలి వస్తున్నవారిని ఎక్కడికి అక్కడ అడ్డుకునే పరిస్థితి కచ్చితంగా ఉంటుంది. పైగా, ఇటీవలే కాపుల సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశమై, రిజర్వేషన్లు త్వరలోనే ఇస్తున్నట్టు ప్రకటించారు. కాపు నేతలు చెప్పిన సమస్యలపై దృష్టి సారిస్తామని ప్రకటించారు. ముద్రగడ ప్రాధాన్యతను తగ్గించే వ్యూహంలో అధికార పార్టీ ఉంది. మరి, ఇలాంటి నేపథ్యంలో ముద్రగడ తాజా వ్యూహం ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.