రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్ల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులూ ఒకే సారి ఢిల్లీ చేరారు. ప్రతినిధి వర్గాల స్వభావం, ఉద్దేశం వేరైనా సందర్భం మాత్రం ఒకేసారి తారసపడటం విశేషం.
నంద్యాల ఉప ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ కేవలం వైసీపీ నేతల ఫిర్యాదులను తప్ప తమ మాటలు పట్టించుకోవడం లేదని టిడిపి ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్ అచల్ జ్యోతికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోనూ ఇలాటి ఆరోపణలు వారు చేస్తూనే వచ్చారు గాని ఏకంగా ఢిల్లీకి వెళ్లడం ఇక్కడ ప్రత్యేకత.
టి నేతలు కూడా…
ఇక తెలంగాణలో ప్రతిపక్షాల ప్రతినిధివర్గం, జెఎసి చైర్మన్ కోదండరాంతో సహా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది. ఇందిరాపార్కు సమీపంలో ధర్నా చౌక్ఎత్తివేత అన్యాయమంటూ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని హౌం శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి మెమోరాండం ఇచ్చారు. తాను దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక వివిధ పార్టీల ప్రతినిధులు కేంద్రాన్ని కలసి సమస్యపై అదికూడా ఏకపక్ష వైఖరిపై ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి కావచ్చు.