తెలంగాణలో సొంతంగా బలపడాలన్న వ్యూహంతో భాజపా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రాష్ట్రంపై భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓ కన్నేసి ఉంచారు. ఆపరేషన్ ఆకర్ష్ కు పచ్చజెండా ఊపినట్టు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది సీనియర్ నేతల్ని భాజపాలోకి ఆకర్షించాలనే వ్యూహంతో జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కు బాధ్యతలు అప్పగించినట్టు కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి భాజపా కన్నంతా టి.కాంగ్రెస్ మీద ఉన్నట్టు అనిపిస్తున్నా… దీర్ఘకాలంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదగడమే లక్ష్యం. మరి, ఈ పరిణామాలను ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తూ ఊరుకుంటున్నారా..? కేంద్రంలో భాజపాతో చెలిమి కోసం చూస్తుంటే… రాష్ట్రంలో అదే పార్టీ తెరాసకు ప్రత్యర్థిగా ఎదిగేందుకు పునాదులు వేసుకుంటున్న పరిస్థితిని కేసీఆర్ అర్థం చేసుకునే ఉంటారు కదా!
నిజానికి, తెలంగాణ విషయంలో భాజపాది దీర్ఘాకాలిక లక్ష్యమే అని చెప్పాలి. ఇప్పటికిప్పుడు 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలన్న ఆతృత వారిలోనూ లేదు. వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే అది సాధ్యం కాదనేది కూడా వారికి తెలుసు. కాకపోతే, వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగితే చాలు. రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం అనేది 2024 ఎన్నికల లక్ష్యంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, భాజపా ప్రస్తుత లక్ష్యం తెలంగాణలోని ఆరు పార్లమెంటు నియోజక వర్గాలపై దృష్టి సారించే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. భువనగిరి, చేవెళ్ల, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్… ఈ ఎంపీ స్థానాలపై భాజపా ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నట్టు సమాచారం. ఆ లెక్కన ఒక్కో పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలపై కూడా పట్టుకోసం భాజపా ప్రయత్నిస్తుంది. ఇదే ప్రస్తుత వ్యూహంగా తెలుస్తోంది.
ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. భాజపా లక్ష్యమైన ఆ పార్లమెంటు స్థానాలపై కూడా ఆయన ఆరా తీస్తున్నారట. ఈ ఆరింటిలో ఒక ఎంపీ ఇప్పటికే భాజపాతో టచ్ లోకి వెళ్లినట్టు కేసీఆర్ కు తెలిసిందట. దీంతో భాజపా మొదలుపెట్టబోతున్న ఆపరేషన్ ఆకర్ష్ కి తెరాస నుంచి ఎవరైనా ఆకర్షితులు అవుతున్నారా అనే కోణంలో కేసీఆర్ వాకబు చేస్తున్నారు. ముఖ్యంగా, తెరాసలో కాస్త అసంతృప్తిగా ఉంటున్న కేకే, డీయస్ వంటి నేతల విషయమై కూడా ఆయన త్వరలో ఏదో ఒక లబ్ధి చేకూర్చే వ్యూహంతో ఉన్నారనీ, ఈ తరుణంలో పార్టీలోని అసంతృప్త నేతల్ని గుర్తించి, భాజపాకి అవకాశం ఇవ్వకుండా వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. విచిత్రం ఏంటంటే.. ఓ పక్క కేంద్రంలోని భాజపా కోసం స్నేహ హస్తం చాచుతున్న కేసీఆర్… రాష్ట్రంలో అదే పార్టీకి అవకాశం ఇవ్వకుండా వ్యూహరచన చేస్తున్నారు!