చేసే పనిని ఎంజాయ్ చేస్తే వయసు ఆటంకం కాదు. లియాండర్ పేస్ సక్సెస్ కు కారణం అదే. 42 ఏళ్ల వయసులో, యు ఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ సాధించాడు. మార్టినా హింగిస్ తో కలిసి ఈ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. పేస్ కు ఇది 17వ గ్రాండ్ స్లాం టైటిల్. ఈ ఏడాదిలోనే మూడోది. కెరీర్ లో మొత్తం 8 డబుల్స్, 9 మిక్స్ డ్ డబుల్స్ గ్రాండ్ స్లాం టైటిల్స్ ను సాధించిన మొనగాడు పేస్. భారత్ టెన్నిస్ రంగంలో ఈ రికార్డును ఎవరైనా బీట్ చేయగలరా అంటే చెప్పలేం. సమీప భవిష్యత్తులో అయితే ఆ అవకాశం లేదంటారు టెన్నిస్ వ్యాఖ్యాతలు.
కలకత్తా కుర్రోడు పేస్ టెన్నిస్ అంటే ప్రాణం. ఆటలో ప్రతి క్షణం ఆస్వాదిస్తాడు. ఆడటం తప్ప మరేమీ తెలియని రియల్ చాంపియన్. డబ్బుకోసమో పేరుకోసం కాదు, తన కోసం ఆడతాడు. దన దేశం కోసం ఆడతాడు. తన సంతృప్తి కోసం ఆడతాడు. అందులో భాగంగా డబ్బు దానంతట అదే వస్తుంది. ఇదే పేస్ విజయ రహస్యం. ఆటను ఆస్వాదిస్తే విజయాలు అవే వలచి వరిస్తాయి. చెన్నైలోలోని బ్రిటానియా అమృత్ రాజ్ టెన్నిస్ అకాడమీలో 1985లో చేరిన పేస్, ఆటలో రాటుదేలాడు. 1990లో వింబుల్డన్ టోర్నీలో జూనియర్స్ చాంపియన్ షిప్ సాధించాడు. నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్ని విజయాలను వచ్చినా వినయంగా తన పనితాను చేసుకున్నాడు. మహేష్ భూపతితో విభేదాలు వచ్చినా ఏకాగ్రత చెదరనీయలేదు. టెన్నిస్ ను ఇష్టంగా ఆడాడు. క్రికెట్ ను సచిన్ ఎంత ఇష్టంగా ఆడతాడో టెన్నిస్ లో పేస్ అంతే.
టెన్నిస్ ఆడటానికి స్టామినా ఎక్కువ అవసరం. పేస్ తన ఫిట్ నెస్ ను కాపాడుకోవడానికి చాలా ప్రాధాన్యం ఇస్తాడు. సాధారణంగా 30 ఏళ్లు దాటగానే టెన్నిస్ ఆటగాళ్లు ఫిట్ నెస్ కోల్పోతాడు. పేస్ మాత్రం 42 ఏళ్లు వచ్చినా అదే ఫిట్ నెస్ కాపాడుకుంటున్నాడు. ఆటలోని మజాను ఆస్వాదిస్తున్నాడు. తాను సంతృప్తి చెందుతున్నాడు. దేశానికి పేరు తెస్తున్నాడు. భారత్ లోనూ భళా అనిపించే గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారని చాటి చెప్తున్నాడు. దటీజ్ పేస్.