మూడుసార్లు తలాక్ చెప్పి భార్యలను విడాకుల పేరుతో వీధుల పాలు చేసే ఆచారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే బాధ్యత ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపైనే పడింది. తలాక్ చెల్లుబాటును నిరోధించే చట్టం చేస్తే అప్పుడు తాము దాని రాజ్యాంగ బద్దతను పరిశీలిస్తామని కోర్టు మెజార్జి తీర్పు నిచ్చింది. తలాక్ రాజ్యాంగ బద్దమే కాదన్నది ముగ్గురు న్యాయమూర్తుల అభిప్రాయం కాగా రాజ్యాంగం 25వ అధికరణం ప్రకారం మత స్వేచ్చకు లోబడే వుందని ప్రధాన న్యాయమూర్తి ఖేర్‌తో సహా మరొకరు అభిప్రాయపడ్డారు. ఈ పద్ధతి ఇస్లామిక్ అవునా కాదా అనేచర్చకు వెళితే వివిధ మతాల విశ్వాసాలలో ఏది ఏ మేరకు పాటించాలన్న మీమాంస వుత్పన్నమవుతుంది. మహిళలకు సమన్యాయం చేయాలన్నది కూడా రాజ్యాంగ సూత్రమే గనక అందుకోసం పార్లమెంటు చట్టం తెస్తే అప్పుడు తాము తుది మాట చెప్పగలమని అప్పటి వరకూ తలాక్‌ను పూర్తిగా నిషేదించలేమని కోర్టు భావించింది. ఇందుకోసం ప్రభుత్వానికి ఆరునెలల వ్యవధి ఇచ్చింది. ఆ ఆరు నెలలు మాత్రం ముస్లిం భర్తలు తలాక్‌ను వాడటం చెల్లదని ప్రకటించింది. తలాక్‌కు బలవుతున్న స్త్రీలకు తాము అండగా వుంటామని ప్రధాని మోడీ ఆగష్టు 15 ప్రసంగంలో కూడా చెప్పారు. కామన్ సివిల్ కోడ్ పేరిట దేశమంతటిపై ఒకే విశ్వాసాన్ని అమలు చేయడం కుదిరేపని కాదు, సరైందీ కాదు. తలాక్ సమస్యనూ సివిల్‌కోడ్ చర్చనూ కలగాపులగం చేయకుండా మోడీ ప్రభుత్వం ముస్లిం మహిళల రక్షణ కోసం ఏదైనా చట్టం తీసుకురావడానికి సుప్రీం కోర్టు తీర్పు ఉపయోగపడుతుంది. మరి ఆరు నెలల్లో వారు ఆ పని చేస్తారో లేక ఎడతెగని వివాదాన్ని సాగిస్తారా అన్నది చూడాలి.