ఆర్బాటపు ప్రచారాలు హడావుడి ప్రారంభాలు ఆంధ్ర ప్రదేశ్లో పరిపాటిగా మారుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఆగష్టు 15 స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేస్తే వారమైనా చుక్క నీరు పారలేదు. తొలి దశ పనులు కూడా పూర్తి కాకుండానే ఆయన ప్రారంభం చేశారు గనకే అనుకున్న ప్రకారం నీరు రాలేదు. గండికోట ప్రెజర్మెయిన్ వరకూ 3500 క్యూసెక్కుల నీటిని పైపుల ద్వారా తీసుకెళ్తామని మొదట చెప్పారు. అక్కడి నుంచి పోలవరం ఎడమకాలువ ద్వారా 1400 క్యూసెక్కులు ఏలేరుకు అందించాలని ఉద్దేశం. పనులు పూర్తికాక చివరకు పుష్కర కాలువ ద్వారా పంపించాలని ప్రత్యామ్నాయ ఆలోచనచేశారు. అయితే హడావుడిగా ఆగష్టు15న అంకితం చేయడంతో గోదావరి నుంచినీరు తోడడమే జరగలేదు. ఎత్తిపోతల ఉత్తపోతలగానే మిగిలింది. సూర్య ఖాన్ కంపెనీ చేస్తున్న ఈ పనులు పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చు. అంతేగాక విద్యుత్ సరఫరాలోనూ సమస్యలున్నాయి. పైగా పుష్కర కాలువ ద్వారా ఇచ్చేట్టయితే పురుషోత్తమ పట్నంపై ఖర్చు ఎందుకు చేసినట్టని ప్రశ్న కూడా ఎదురైంది.