తన 151వ సినిమా టైటిల్ విషయంలో చిరంజీవి పెద్ద షాకే ఇచ్చాడు. మొదట్నుంచీ ప్రచారంలో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పక్కన పెట్టారు. ఆమధ్య వెలుగులోకి వచ్చిన మహావీరనీ పట్టించుకోలేదు. ఎవ్వరి అంచనాలకూ అందకుండా ‘సైరా’తో షాక్ ఇచ్చాడు చిరు. నిజానికి ఇదో గొప్ప ఎత్తుగడ. అభిమానుల అంచనాలకు ఈ సినిమా అందదని ముందుగానే చెప్పే ప్రయత్నం. టైటిల్‌తోనే అటెన్షన్ తీసుకురావడం అభినందించదగిన విషయం. అదేంటో వింటూ వింటూ ఉంటే.. ఉయ్యాల వాడ కంటే సైరానే అద్భుతంగా ఉందనిపిస్తోంది. కాకపోతే కొంతమంది మాత్రం `ఇదేం టైటిల్.. ఇలా ఉంది` అంటూ పెదవి విరుస్తున్నారు. అప్పుడే.. టైటిల్‌పై రుసరుసలు గుసగుసలు కూడా మొదలైపోయాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ తీస్తూ.. సైరా అనే టైటిల్ పెట్టడం ఏంటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు.. ఉయ్యాల వాడ వారసులు కొంతమంది ఈ టైటిల్ విషయంపై తన అసహనం వ్యక్తం చేస్తూ చిత్రబృందానికి ఓ లేఖ రాశారు. టైటిల్ మార్చమంటూ అభ్యర్థిస్తున్నారు. సైరా అనే పదాన్ని రాయలసీమలో నెగిటీవ్‌గా వాడతారట. ఇప్పుడు సైరా అనే పదానిఇక అర్థాలు, నానార్థాలు ఏంటో వెదికే పనిలో ఉన్నారు తెలుగు కవి పుంగవులు. ఎవరేమనుకొన్నా.. టైటిల్‌తో, డిజిటల్ పోస్టర్‌తో, నటీనటులు సాంకేతిక నిపుణులతో పూర్తి మార్కులు కొట్టేశారు చరణ్, సురేందర్‌రెడ్డి టీమ్. ఈ జోరు ఇలానే కొనసాగాలని కోరుకొందాం.