తమిళనాడు రాజకీయం మరోసారి అనూహ్యమైన మలుపు తిరిగింది! ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వమ్ వర్గాలు రెండూ ఒకటైన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ రెండు వర్గాలు ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం ఖాయమనేది కూడా దాదాపు ఖరారు అయిపోయింది. సరిగ్గా ఈ దశలో అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు దినకరన్! చిన్నమ్మ శశికళ వర్గానికి చెందిన 19 ఎమ్మెల్యేలు పళని స్వామి సర్కారుకు మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించడం, ఎవ్వరూ ఊహించని పరిణామం. దీంతో పళని స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. పళని స్వామి ప్రభుత్వం పూర్తిగా అవినీతి మయమైందనీ, దీంతో అన్నాడీఎంకే సర్కారుకు చెడ్డ పేరు వస్తోందన్న ఏకైక కారణంతోనే తమ వర్గం ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు దినకరన్ చెబుతున్నారు. ప్రస్తుతం దినకరన్ వర్గంలో 19 ఎమ్మెల్యేలు ఉన్నారనీ, మరో ముగ్గురు స్వతంత్రులు కూడా ఉన్నట్టు ఆ వర్గం చెబుతోంది. అయితే, ఈ సంఖ్య మరింత పెరుగుతుందనీ, చాలామంది ఎమ్మెల్యేలు తమ వర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు చిన్నమ్మ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.
దీంతో డీఎంకే కూడా రంగంలోకి దిగేసింది. ముఖ్యమంత్రి పళని స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిందనీ, వెంటనే బలనిరూపణకు ఆదేశాలు ఇవ్వాలంటూ గవర్నర్ ను స్టాలిన్ కోరారు. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందనీ, పళని సర్కారు పడిపోతే, ఆ వెంటనే డీఎంకేకి మద్దతు ఇచ్చేందుకు దినకరన్ సిద్ధంగా ఉన్నారంటూ తమిళనాట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి గవర్నర్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారబోతోంది. ఆయన స్పందన కోసం పళని వర్గం కూడా ఎదురుచూస్తోందని సమాచారం. ఒకవేళ గవర్నర్ బలపరీక్ష చేయాలని ఆదేశాలు జారీ చేస్తే… పళని వర్గానికి దిక్కుతోచని పరిస్థితి వస్తుందని కొంతమంది అంటున్నారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అయితే, ఇప్పటికిప్పుడు గవర్నర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో కేంద్రంలోని ఎన్డీయేలో అన్నాడీఎంకే చేరితే తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు మరోసారి క్యాంపు రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. దినకర్ వర్గంలోని ఎమ్మెల్యేలను ఇప్పటికే పాండిచ్చేరిలోని హోటళ్లకు తరలించారు. అక్కడే ఎందుకంటే, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి.. భాజపా ప్రేరేపిత ఇబ్బందులు వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి! నిజానికి, ఇప్పట్లో బలపరీక్ష ఉండే అవకాశాలు తక్కువే అని నిపుణులు చెబుతున్నారు! ఎందుకంటే, గడచిన ఏప్రిల్ నెలలోనే పళని స్వామి సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కొంది. మరో బలపరీక్ష పెట్టాలంటే ఆర్నెల్లు గడువు ఉండాలి. అంటే, అక్టోబర్ వరకూ గడువు ఉన్నట్టే కదా. ఈలోగా చాలా సమీకరణలు మారతాయనేది పళని వర్గం అంచనా అని చెబుతున్నారు. మొత్తానికి, తమిళ రాజకీయాలు ఎటువైపు వెళ్తాయనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది.