కేంద్రంలోని భాజపాతో స్నేహం కోసం ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే! రాష్ట్రపతి ఎన్నికలు తెరమీది రాకముందే ఈ ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఓసారి జగన్ కలవడం, ఆ తరువాత ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి జగన్ బేషరతు మద్దతు ప్రకటించడం.. ఇవన్నీ భాజపాకి వైకాపాని దగ్గర చేసిన పరిణామాలు. అయితే, అసలు విషయం ఇప్పుడు తేలనుంది. జగన్ ను కేంద్రం నిజంగానే దగ్గరకు తీసుకుంటుందా, లేదా ఇదంతా వైకాపా అత్యుత్సాహమా అనేది త్వరలోనే తేలిపోతుంది! ఎందుకంటే, కేంద్రంలో మంత్రి వర్గ విస్తరణకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. దీన్లో భాగంగా కొత్త మిత్రులకు అవకాశం ఇవ్వాలని మోడీ ఆలోచనగా ప్రచారం సాగుతోంది.
భాజపా కొత్త దోస్తులు అనగానే ముందుగా గుర్తొచ్చేది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. అనూహ్య పరిణామాల మధ్య బీహార్ లో కూడా తన ఉనికి చాటుకుంది భాజపా! లాలూ ప్రసాద్ యాదవ్ తో ఉన్న మైత్రీబంధాన్ని తెంచేసుకుని, లాలూ కుమారుడుపై అవినీతి ఆరోపణలను కారణంగా చూపించి సీఎం పదవికి నితీష్ రాజీనామా చేయడం, ఇరవై నాలుగ్గంటలు తిరిగేలోగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయడం లాంటి డ్రామా అంతా చూశాం. నితీష్ కు భాజపా స్నేహ హస్తం ఎంతగా అందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి, కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో జేడీ యూకి స్థానం కల్పించడం ఖాయం అనే కథనాలు వినిపిస్తున్నాయి. ఇక, తమిళనాడుకు కూడా కేంద్ర క్యాబినెట్ లో బెర్తు ఖాయం అంటున్నారు. అక్కడ కూడా అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే! ముఖ్యమంత్రి పళని, పన్నీరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడంలో ఎంత కాదనుకున్నా మోడీ సర్కారు పోషించింది పెద్దన్న పాత్రే. రెండు వర్గాలను ఒకటి చేసి.. అనంతరం అన్నాడీఎంకే మద్దతు ఎన్డీయేకి ఇచ్చేలా చేయడమే వ్యూహంగా తమిళనాట ఈ మధ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయేకే తమ మద్దతు ఉంటుందని అన్నాడీఎంకే ప్రకటించే అవకాశాలు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. సో… విస్తరణలో తమిళనాడుకూ బెర్త్ ఖాయమంటున్నారు.
ఇక, తరువాతి కొత్త మిత్రుడి చర్చ అంటే.. జగన్ దే! జాతీయ మీడియాలో ఇప్పటికే వచ్చిన ఓ కథనం ప్రకారం.. ముగ్గురు కీలక భాజపా నేతలతో జగన్ ఇటీవలే చర్చలు జరిపారట! ఈ భేటీలోనే ఓ క్లారిటీ వచ్చేసిందనీ, జగన్ పార్టీకి ఒక కేంద్రమంత్రి పదవి దక్కబోతోందంటూ ఢిల్లీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. భాజపా – వైకాపాల మధ్య మంతనాల్లో కర్ణాటకకు చెందిన గాలి జనార్థన్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. ఇంకోపక్క ఎంపీ విజయసాయి రెడ్డి కూడా తనవంతు లాబీయింగ్ చేస్తున్నారట! మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కించుకోవడం ద్వారా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇవ్వొచ్చనే వ్యూహంతో వైకాపా ఉందని సమాచారం.. మరి, ఇంత జరుగుతూ ఉంటే.. ప్రస్తుత మిత్రపక్షమైన టీడీపీ కూడా తన పని తాను చేస్తుంది కదా! ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్న ఈ తరుణంలో టీడీపీని కాదని, జగన్ ను దగ్గరకి చేర్చుకుంటే ఏంటనే చర్చ కూడా భాజపాలో జరుగుతుంది కదా! మొత్తానికి, ఈ అంశం ప్రస్తుతం ఆసక్తికరంగానే మారింది. భాజపా నిర్ణయం ఎలా ఉండబోతోందనేది వేచి చూడాలి.