రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిపోయింది నంద్యాల ఉప ఎన్నిక. అధికార, ప్రతిపక్షాలు పోటీ పడి ప్రచారాన్ని హోరెత్తించాయి. ఈ రోజు జరుగుతున్న ఉప ఎన్నికకు నియోజక వర్గంలో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. నంద్యాల ఉప ఎన్నిక మొదలైంది. సాయంత్రం 6 వరకూ ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవచ్చు. అయితే, ఈ సందర్భంలో నంద్యాల నియోజక వర్గంలో సగటు ఓటరు మానసిక స్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏయే అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఫలానా పార్టీకి ఓటెయ్యాలనే నిర్ణయం తీసుకుంటాడా అనేదే ఆసక్తికరం! అదేంటీ.. చంద్రబాబు మూడేళ్ల పాలన నచ్చినవాళ్లు టీడీపీకి ఓటేస్తారు, నచ్చనివారూ జగన్ ను కోరుకుంటున్నవారూ వైకాపాకి ఓటేస్తారు, ఇందులో అంతగా తర్జనభర్జన పడాల్సిన మతలబు ఏంలేదే అంటారా! జాగ్రత్తగా ఆలోచిస్తే… ఉందనే అర్థమౌతుంది.
నంద్యాల ఉప ఎన్నికలో ప్రధానాంశం భూమా నాగిరెడ్డిపై సానుభూతి! ఆయన మరణంతో నంద్యాల స్థానం ఖాళీ అయింది. అయితే, ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరిన తరువాత దివంగతులయ్యారు. 2014లో వైకాపా టిక్కెట్ మీద ఎన్నికయ్యారు. అంటే, భూమా అభిమానులంతా వైకాపా వర్గమనేగా కదా అర్థం. ఇప్పుడు ఉప ఎన్నికనాటి పరిస్థితికి వస్తే.. భూమాపై ఉన్న సానుభూతిని ఆ వర్గీయులు వ్యక్తీకరించాలంటే ఆ కుటుంబానికి చెందిన బ్రహ్మానంద రెడ్డికే ఓటెయ్యాలి. కానీ, ఇక్కడ బ్రహ్మానంద రెడ్డికి టిక్కెట్ ఇచ్చిందెవరూ… తెలుగుదేశం! గత ఎన్నికల్లో వైకాపా మీద అభిమానంతో భూమాకి ఓటేసిన వారు… ఇప్పుడు భూమా కుటుంబంపై ఉన్న అభిమానంతో తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యాల్సిన పరిస్థితి! భూమా కుటుంబానికి తమ సానుభూతి తెలిపాలంటే.. గతంలో వ్యతిరేకించిన టీడీపీకే ఓటెయ్యాలి. సగటు ఓటరుకు ఇది సందిగ్ధమే కదా.
ఇలాంటి పరిస్థితే వైకాపాకి కూడా ఉంది! ప్రస్తుతం నంద్యాల బరిలో ఉన్నదెవరు… వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి. 2014 ఎన్నికల్లో టీడీపీని వ్యతిరేకించిన వైకాపా వర్గం, నిన్నమొన్నటి వరకూ శిల్పాను కూడా విమర్శించింది కదా! అయితే, ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో వైకాపాకి ఓటెయ్యాలంటే.. జగన్ అభిమానులంతా శిల్పాకి ఓటెయ్యాలి. అంటే, ఇక్కడ కూడా అదే సందిగ్దత! వైకాపాపై ఉన్న అభిమానాన్ని వ్యక్తీకరించాలంటే నిన్నమొన్నటి వరకూ వైరి వర్గంలో ఉన్న శిల్పాకి ఓటెయ్యాల్సిన పరిస్థితి. మొత్తానికి, ఇవన్నీ సగటు ఓటరను గందరగోళ పరచే అంశాలే. అందుకే, నంద్యాల ఉప ఎన్నిక అధికార ప్రతిపక్షాలతోపాటు సగటు ఓటరుకు కూడా పరీక్షే! వీటన్నింటినీ దాటుకుని తమ తీర్పును ఇచ్చేందుకు నంద్యాల ఓటర్లు ఇప్పుడు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.